
చివరి భూములకు ఈసారైనా నీరందేనా?
రాయచూరు రూరల్: మూడు దశాబ్దాల నుంచి వర్షాభావంతో జిల్లా రైతులు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్నారు. ఉన్న నీటి వనరులు వినియోగించుకోలేని రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోంది. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల కింద రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. పంట భూములు తమ కళ్ల ముందే బీళ్లుగా మారుతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు. పిచ్చి మొక్కలు, పూడికతో నిండిన స్థితిలో కాలువలు ఉన్నాయి. జిల్లాకు వర్షపాతం ఒక శాపమైతే, పాలకుల శీతకన్నుతో ఎడమ కాలువ ఆధునికీకరణ పేరుతో రూ.కోట్లాది నిధుల విడుదల జరిగినా పనులు మాత్రం సక్రమంగా జరగకుండా పోయాయి. కాలువలకు నీరు వదిలితే ఏ క్షణంలోనైనా గండ్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాలువలకు ఇరువైపుల కట్టలకు ఉన్న సిమెంట్ కాంక్రీట్ జారిపోయింది. అక్కడక్కడ నాపరాళ్లు పగిలిపోయాయి. ఎర్రమట్టి కుదించుకు పోయింది. 99, 102వ డిస్ట్రిబ్యూటరీల కింద మమదాపుర, మర్చటహాళ్, నెలెహాళ్, మటమారి, ఆశాపుర, దిన్ని, యరగేర, మంజర్ల తదితర ప్రాంతాల్లో ఉపకాలువలకు నీరందడం కష్టమైంది.
కాలువ గట్లు బలహీన పడిన వైనం
పట్టించుకోని అధికారులు, పాలకులు