
మిమ్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలి
మండ్య: మండ్య మెడికల్ కాలేజీ ఆస్పత్రి (మిమ్స్)కి చెందిన 18 ఎకరాల స్థలాన్ని కాపాడాలని రక్షణ వేదిక, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం సహా పలు సంఘాల నేతలు, కార్యకర్తలు మండ్యలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి ర్యాలీని ఆరంభించారు. మిమ్స్ అనేది జిల్లాలో 30 లక్షల మందికి ఉపయోగపడే ప్రధాన ఆస్పత్రి అన్నారు. నిత్యం వందలాది మంది వైద్యసేవలకు వస్తుంటారని, 400 పడకల ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే మిమ్స్‌కు చెందిన 18 ఎకరాలు కబ్జా కోరల్లో ఉందని, దానిని రక్షించాలని నినాదాలు చేశారు. శివరామేగౌడ సునందా జయరాం, నాగణ్ణగౌడ, జయరాం తదితరులు పాల్గొన్నారు.
డీకేశిని సీఎం చేయాలి
● వంద మందికి పైగా
ఎమ్మెల్యేల మాట ఇది
● ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్
శివాజీనగర: కాంగ్రెస్‌లో వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుతున్నారు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తప్పకుండా సీఎం అవుతారని ఆయన మద్దతుదారు, రామనగర హస్తం ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. రామనగరలో విలేకరులతో మాట్లాడిన ఆయన, తాను చెప్పేది వాస్తవమన్నారు. శివకుమార్ పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుచేత ఆయనకు సీఎం స్థానం లభించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. ఇదే మాటను సుర్జేవాలాకు చెబుతానన్నారు.
సుర్జేవాలా చర్చలు
రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చి, సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీసేందుకు వచ్చిన ఇన్‌చార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా 2వ రోజున మంగళవారం భేటీలు కొనసాగించారు. మంత్రులు పట్టించుకోవడం లేదు, వారికి బుద్ధి చెప్పండని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎన్.ఏ.హ్యారిస్, రిజ్వాన్, ఎం.కృష్ణప్ప, ప్రియాకృష్ణ, శివణ్ణ, ఏ.సీ.శ్రీనివాస్, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ తదితరులు సుర్జేవాలను కలిసి మాట్లాడారు.
సీబీఐకి వాల్మీకి మండలి స్కాం కేసు: హైకోర్టు
బనశంకరి: రాజకీయ కలకలం రేకెత్తించిన మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం హైకోర్టు ఆదేశించింది. యూనియన్ బ్యాంక్ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న సిట్ విచారణను రద్దు చేసింది. ఇప్పటివరకు సిట్ సేకరించిన ఆధారాలను సీబీఐ కి అందించాలని ఆదేశించింది. కేసు సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో పలువురు సీనియర్ నేతలకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తోంది. ఈ కేసులో బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మంత్రి పదవిని కోల్పోవడం తెలిసిందే. ఆయనను ఈడీ అరెస్టు కూడా చేయగా ప్రస్తుతం బెయిలు పొందారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది.
సెలూన్‌లో
మహిళలకు మస్కా
యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు. ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.

మిమ్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలి