
ఐదేళ్లలో 82 పులులు చనిపోయాయా?
శివాజీనగర: రాష్ట్రంలో గత ఐదున్నర సంవత్సరాల్లో 82 పులులు మృతి చెందాయని సాక్షి దినపత్రిక సహా పలు మీడియాల్లో వార్తా కథనాలు రావడంపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టి సారించారు. అన్ని పులుల మరణాల గురించి నివేదిక ఇవ్వాలని అటవీ అధికారులకు సూచించారు. ఎన్ని పులులు సహజంగా మరణించాయి? ఎన్ని అసహజంగా మృతి చెందాయి? అసహజ మరణాలకు కారణాలేమిటి, నివేదికలు ఏమైనా వచ్చాయా అని అటవీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఆ పులుల కళేబరాల గోళ్లు, దంతాలు సేకరించారా, నిర్లక్ష్యం చూపిన సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారా? ఎన్ని పులుల హత్య కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారో వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు పులుల హత్య కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎన్ని కేసులు తనిఖీ దశలో ఉన్నాయి తదితర సమాచారన్ని 10 రోజుల్లోగా తమకు సమ ర్పించాలని తెలిపారు.
అటవీ ఉన్నతాధికారులపై చర్యలు
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలెమహాదేశ్వరబెట్ట అడవిలో తల్లి, నాలుగు పిల్ల పులులను కొందరు విషాహారం పెట్టి చంపిన కేసులో జిల్లా డీసీఎఫ్ చక్రపాణి, ఎసీఎఫ్ గజానన హెగడె, విభాగ అధికారి మాదేష్‌లకు ప్రభుత్వం బలవంతంగా సెలవు ఇచ్చింది. రోడ్డుకు సుమారు 100 మీటర్ల దూరంలోనే పులులు చనిపోతే పట్టించుకోలేదని సర్కారు ఆగ్రహించింది. అక్కడికి 800 మీటర్ల దూరంలో చెక్‌పోస్టు ఉన్నా స్పందన లేదని, పైగా అటవీ వాచర్లు ధర్నా చేస్తుంటే పరిష్కరించలేదని అసంతృప్తిని వ్యక్తంచేసింది. అటవీ అధికారులు, గస్తీ సిబ్బంది లోపం వల్లే పులులు చనిపోయినట్లు నిర్ధారించి సెలవు ఆదేశాలిచ్చింది.
విచారణకు అటవీ మంత్రి ఆదేశం