
ఆరోగ్యకర దేశ నిర్మాణం అందరి బాధ్యత
హొసపేటె: ఆరోగ్యకరమైన దేశ నిర్మాణానికి అందరి సహకారం అవసరం, ఇది ఒక బాధ్యత కూడా అని కన్నడ సినీ నటుడు అజయ్‌రావు తెలిపారు. గురువారం నగరంలోని పునీత్ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు నాటకం, వ్యాసరచన పోటీలు వంటి కార్యకలాపాల ద్వారా మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి బానిసైన వారిని గుర్తించి వ్యసన రహిత కేంద్రాల ద్వారా చికిత్స చేయాలన్నారు. మాదకద్రవ్యాలు వాడే వ్యక్తి తన స్వంత ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం ద్వారా వ్యసనం నుంచి విముక్తి పొందవచ్చని ఆయన అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కొప్పళ గవిమఠం అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామీజీ, నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.