
మత్తుతో చేసుకోవద్దు జీవితాలు చిత్తు
రాయచూరు రూరల్: నగర, ,గ్రామీణ ప్రాంతాల్లో యువకులు గంజాయి, హఫీమ్ వంటి మత్తు పదార్థాలను సేవించి ఆరోగ్యాలను నాశనం చేసుకోరాదని జిల్లాధికారి నితీష్ సూచించారు. గురువారం ప్రైవేట్ పాఠశాలలో జిల్లాధికారి, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య శాఖ, మానసిక ఆరోగ్య శాఖ, రిమ్స్, నవోదయ ఆస్పత్రి, భండారి ఆస్పత్రి, ఐఎంఏల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో గంజాయి మాదక వస్తువుల సేవన నిర్మూలనపై జన జాగృతి జాతాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఈ విషయంపై ప్రజలను జాగృతం చేయాలన్నారు. ఇంటింటికెళ్లి యువకులు మాదక వస్తువులను సేవించకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చైతన్యపరచాలన్నారు. జాతాలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు, ఎస్పీ పుట్టమాదయ్య, డీఎస్పీ శాంతవీర, రిమ్స్ అధికారులు విజయ శంకర్, రమేష్, మనోహర్ పత్తార్, యశోద, గణేష్, ప్రజ్వల్, పవన్ పాటిల్, కుంటెప్పలున్నారు. రిమ్స్ కళాశాల విద్యార్థులకు గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి నాటక ప్రదర్శన చేశారు.