
కలబుర్గి ధాబాలో ముగ్గురు దారుణ హత్య
రాయచూరు రూరల్: పాత కక్షలను మనస్సులో పెట్టుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన కలబుర్గి ధాబాలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ధాబాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో దుండగులు మారణాయుధాలతో సిద్దారూడ(32), రామచంద్ర(35), జగదీష్(25)లను హత్య చేసి పరారయ్యారు. రెండు బీరు సీసాల బిల్లుల కోసం రాద్ధాంతం కావడంతో గొడవ అధికమై ఒకరినొకరు కొట్టుకోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. గత ఏడాది నవంబర్‌లో కూడా ధాబా యజమాని సోము రాథోడ్‌పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చోరీల బెడదకు
కళ్లెం వేయరూ
బళ్లారిఅర్బన్: నగర శివారులోని ఆంధ్రాళ్‌లో పెచ్చుమీరిన చోరీలు, అసాంఘిక కార్యకలాపాలపై సంబంధిత ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ సీఐకు ఆంధ్రాళ్ సేవా సంఘం ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ రామాంజినేయ, సహ కార్యదర్శి జిన్ రుద్ర, ప్రముఖులు సన్నత్‌కుమార్, రమణయ్య, వెంకటేశులు, గోవిందరెడ్డి, చిదానంద, బోలంరెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8వ వార్డు పరిధిలోని అంధ్రాళ్ చుట్టు పక్కల కేవలం 6 నెలల్లో పలు చోరీలు, పేకాట తదితర జూదాలు యథేచ్చగా సాగుతున్నాయని తెలిపారు. యశ్వంత్ నారాయణ సింగ్ పొలం దగ్గర మోటార్లు కూడా చోరీకి గురయ్యాయన్నారు. ఈ నెల 24న బూదిహాళ్ తదితర చోట్ల కూడా చోరీలు జరిగాయన్నారు. రెండు నెలల క్రితం బొరుగుల బట్టీ వెనుక ఐరన్ అంగట్లో చోరీ జరిగిందన్నారు. మేకలు కూడా చోరీ చేశారు. కొండాపురం తదితర చోట్ల కూడా పశువుల చోరీ జరిగిందన్నారు. తక్షణమే సంబంధిత పోలీసులు ఈ చోరీల వెనుక ఎవరున్నారో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ గస్తీని తక్షణమే పెంచాలని కోరారు.
ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి చెప్పండి
రాయచూరు రూరల్ : ప్రతి ఒక్కరూ ప్లాిస్టిక్ వాడకానికి స్వస్తి పలకాలని జిల్లా న్యాయమూర్తి స్వాతిక్ పేర్కొన్నారు. బుధవారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జాతీయ మొక్కలు నాటే దినోత్సవం, ప్లాస్టిక్ ముక్త దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు మానవుడు పరిసరాల సంరక్షణకు తోడు ప్లాస్టిక్‌ను దూరం చేయడం వల్ల భవిష్యత్తులో రోగాల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. నగరసభ కమిషనర్ సంగమేష్, విద్యా శాఖ అధికారి బడిగేర్, మురళీధర్, ప్రకాష్, సాగర్‌లున్నారు.
కసాప సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలి
బళ్లారిఅర్బన్: డిసెంబర్‌లో నగరంలో జరగనున్న 88వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి నగరాన్ని ఇప్పటి నుంచే చక్కగా తీర్చిదిద్దాలని కన్నడ నాడు రైతు సంఘం జిల్లాధ్యక్షుడు మెణసినకాయి ఈశ్వరప్ప విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మేయర్ ముల్లంగి నందీష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలో గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ విషయంలో పాలికె అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకొని సమ్మేళనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. సమ్మేళనాన్ని బళ్లారిలో ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను ఇప్పటి నుంచి ప్రారంభించాలని ఆయన మేయర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఆ సంఘం పదాధికారులు, నేతలు పాల్గొన్నారు.

కలబుర్గి ధాబాలో ముగ్గురు దారుణ హత్య

కలబుర్గి ధాబాలో ముగ్గురు దారుణ హత్య

కలబుర్గి ధాబాలో ముగ్గురు దారుణ హత్య