
తుంగభద్రకు జలకళ
హొసపేటె: తుంగభద్ర జలాశయం క్రస్ట్‌గేట్ల తొలగింపు పనులు ప్రారంభించక పోవడంతో నిపుణుల నివేదిక, సలహా ఆధారంగా తుంగభద్ర బోర్డు ఈసారి జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈలోగా బోర్డు రిజర్వాయర్ కాలువలపై కూడా పనులు చేపట్టింది. ఇప్పుడు ఐసీసీ సమావేశం షెడ్యూల్ ఖరారైనందున రైతులకు నీటిని పంపిణీ చేస్తే ఈ పనులను కూడా నిలిపి వేయాల్సి ఉంటుంది. అయితే రైతులకు నీటి సరఫరా చాలా ముఖ్యం, ఈ పనులను తిరిగి ప్రారంభించవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 124వ నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం ఈనెల 27న బెంగళూరులో జరగనుంది. రైతులు ఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు.
10 లక్షల ఎకరాలకు నీరు
విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తుంది. వర్షాకాలంలో జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి పంపిణీ కోసం కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన విధానసౌధలోని రూమ్ నెంబర్– 334లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఐసీసీ సమావేశం జరగనుంది. రాయచూరు, బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే ప్రారంభమైనందున, జలాశయంలో ఇప్పటికే 46.290 టీఎంసీల నీరు నిల్వ చేరింది. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో కూడా క్రమంగా పుంజుకుంటోంది. కాగా జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ఈ సంవత్సరం కేవలం 80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేసుకోవాలని నిర్ణయించారు.
రోజురోజుకు పెరుగుతున్న వరద ఉధృతి
ఈఏడాది 80 టీఎంసీల నిల్వకు తీర్మానం