కృష్ణరాజపురం: బెంగళూరు తూర్పు తాలూకా కాడుగోడి ప్లాంటేషన్ సర్వే నంబర్–1లో కబ్జాకు గురైన వేలాది కోట్ల రూపాయల విలువ చేసే 120 ఎకరాల అటవీ శాఖ భూమిని గట్టి పోలీసు బందోబస్తుతో ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా కబ్జాదారులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చాలా ఏళ్లుగా తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని, కోర్టులో కేసు కూడా ఇంకా పెండింగ్‌లో ఉందని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద షెడ్లు, నిర్మాణాలను కూల్చే పని సాగుతోంది.
పబ్‌లో లైంగిక వేధింపులు.. టెక్కీ అరెస్టు
శివాజీనగర: నగరంలో కబ్బన్ పార్కు వద్ద ఉన్న ఓ పబ్‌లో ఓ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఓ టెక్కినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనురాగ్ అనే వ్యక్తి. ఓ ప్రైవేట్ కంపెనీలో నిందితుడు, బాధితురాలు టెక్కీలుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కబ్బన్ పార్కు వద్ద ఓ పబ్‌కు పార్టీకి వెళ్లారు. తాగిన మైకంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారానికి ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు కబ్బన్ పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు పరియస్తులని, మద్యం మత్తులో అకృత్యానికి ప్రయత్నించినట్లు పోలీసుల తనిఖీలో తెలిసింది. కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.
కారు ఢీకొని మహిళల మృతి
దొడ్డబళ్లాపురం: కారు ఢీకొన్న ప్రమాదంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడే మృతి చెందిన సంఘటన దేవనహళ్లి తాలూకా బొమ్మవార గ్రామం వద్ద జరిగింది. తిమ్మక్క (60) యశోద (33) మృతులు. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఇద్దరినీ ఢీకొంది. తీవ్ర గాయాలైన మహిళలు దుర్మరణం చెందారు. విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాంట్రాక్టరు నరికివేత
హుబ్లీ: హావేరి జిల్లాలో పట్టపగలే ఓ కాంట్రాక్టర్‌ను దుండగులు హత్య చేశారు. వివరాలు సిగ్గావి పట్టణ శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. శివానంద కున్నురు (40) ఫస్ట్‌గ్రేడ్ కాంట్రాక్టరు, గంగిబావి క్రాస్ వద్ద పట్టపగలే పెద్ద కత్తులతో నరికి హత్య చేసి పరారయ్యారు. ఈ ఉదంతంతో స్థానికులు భీతావహులయ్యారు. ఆస్తి వివాదమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కిరాయి హంతకులతోనే హత్య చేయించినట్లు ఆయన కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ, సీఐ పరిశీలించారు.
7 బిల్లులను ఆమోదించండి
● రాష్ట్రపతికి సీఎం సిద్దు వినతి
శివాజీనగర: రాష్ట్ర గవర్నర్ పరిశీలన కోసం పంపిన ఏడు బిల్లులను ఆమోదించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును భేటీ చేశారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర బిల్లులకు ఆమెదం తెలుపాలని విన్నవించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన, మైనారిటీలకు ప్రభుత్వ పనుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే కర్ణాటక ప్రజా సేకరణ పారదర్శక సవరణ బిల్లు–2025, రాష్ట్రంలో ఏ– కేటగిరి ఆలయాల ఆదాయంలో 10 శాతం వరకూ నిధులను సీ– కేటగిరి దేవాలయాల అభివృద్ధికి వినియోగించే కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ ట్రస్ట్‌ల సవరణ బిల్లు తదితరాలకు పచ్చజెండా ఊపాలని విన్నవించారు. 7 బిల్లులను మీ పరిశీలనకు పంపించారని తెలిపారు. సీఎం వెంట మంత్రి డాక్టర్ హెచ్.సీ.మహదేవప్ప, పలువురు నేతలు ఉన్నారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన బాలీవుడు నటుడు అమీర్‌ఖాన్, సిద్దరామయ్య పలకరించుకున్నారు.

కబ్జాల తొలగింపు