
ధార్వాడ ఐఐటీకి రూ.2 వేల కోట్ల అదనపు నిధులు
● కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
హుబ్లీ: ధార్వాడలోని ఐఐటీకి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేట కోట్ల నిధులను అదనంగా కేటాయించిందని, దేశంలోని అన్ని ఐఐటీల కన్నా ఈ ఐఐటీ ఉన్నతమైన అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బీవీబీ కళాశాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ ఫస్ట్ గ్రేడ్ కళాశాల లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో భారత్‌లో విద్య, ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యలో భారత్ మేటిగా నిలిచింది. దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. దేశంలో ఇతర ఐఐటీల కన్నా ధార్వాడ ఐఐటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం– 2020 ఓ చారిత్రాత్మకం. విద్య రంగంలో సంస్కరణలకు నాంది పలికిందన్నారు. జాతీయ విద్య విధానం ప్రపంచీకరణలో మహాశక్తిగా రూపొందించే లక్ష్యం ఉందన్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య వరకు సమగ్రమైన ఎంతో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించే దిశలో అవసరమైన నైపుణ్యాలను పొందేలా విద్యాభ్యాసం అందిస్తున్నామన్నారు. అచ్చే దిన్ కహాహై అనే వారికి భారత్ తగిన సమాధానాన్ని ఆచరణలో చూపెట్టిందన్నారు. వారు కళ్లు తెరిచి చూడాలని హితవు పలికారు. నేటి విద్య రంగం ఆధునికత సంచరించుకుంది. 21వ శతాబ్దపు విద్య భవిష్యత్తుకు దోహదపడేలా పలు సంస్కరణలు చేపట్టామని కేంద్ర మంత్రి వివరించారు.