
దశాబ్దాలు గడిచినా వెనుకబాటుతనమే
రాయచూరు రూరల్: ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన కల్యాణ కర్ణాటక ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. విద్య, వైద్య, అరోగ్య, ఉద్యోగ రంగాలలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సమానంగా కళ్యాణ కర్ణాటక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గతంలో హైద్రాబాద్–కర్ణాటక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. 2015 జూన్‌లో అప్పటి ప్రధాని మనోహ్మన్‌సింగ్ అర్టికల్ 371(జే)ను అమలు చేశారు. అయినా ఇప్పటికీ కల్యాణ కర్ణాటక అభివృద్ధి చెందలేదు. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాలు వస్తాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. బడ్జెట్‌లో ఏటా రూ.15వేల కోట్లు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు కేటాయిస్తున్నారు. రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు ఈ నిధులను సక్రమంగా వినియోగించడం లేదు. ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విద్యారంగంలో ఐదు వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇక్కడ నియమితులైన ఉపాధ్యాయులు ర రెండేళ్ల తర్వాత ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్తున్నారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ పడుతున్నాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఉద్యోగాల విషయంలో దక్షిణ, ఉత్తర కర్ణాటకు ఇచ్చిన ప్రాముఖ్యతను కళ్యాణ కర్ణాటకకు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా పాలకులు చిత్తశుద్ధతో వ్యవహరించి కల్యాణ కర్ణాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కల్యాణ కర్ణాటకలో సక్రమగా
అమలు కాని ఆర్టికల్ 371(జె)
విద్య, అరోగ్య, ఉద్యోగ రంగాల్లో నిర్లక్ష్యం