అటు చెట్లు.. ఇటు గుంతలు | - | Sakshi
Sakshi News home page

అటు చెట్లు.. ఇటు గుంతలు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

మంథని: ఆర్‌ అండ్‌ బీ అధికారుల అలసత్వంతో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన రహదారులపై ప్రమాదకర గుంతలను పూడ్చటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతేగాకుండా దారివెంట ఉన్న ప్రమాదకర చెట్లను తొలగించడంలోనూ అదేధోరణి అవలంబిస్తున్నారు. ఇందుకు పెద్దపల్లి జిల్లా మంథని–గోదావరిఖని రహదారిలోని మల్లేపల్లి శివారులో భారీ గుంత ఏర్పడి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. దారి మధ్యలో చాలాచోట్ల గుంతలు ఉన్నా పూడ్చకుండా నిర్లక్ష్యం వహించడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. మల్లేపల్లి శివారులో ఏర్పడిన గుంతను గతంలో మంథని పోలీసులు మొరం పోయించి పూడ్చివేయించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కొద్దిరోజులకే గుంత మళ్లీ పెద్దగా ఏర్పడింది. చాలా రోజులుగా దారి మధ్యలో గుంత ఉంటున్నా అధికారులు పూడ్చడం లేదు.

ఆదమరిస్తే అంతే సంగతులు

దారి మధ్యలోని గుంత వాహనదారులకు దగ్గరగా వచ్చేవరకూ కనిపించడం లేదు. రాత్రివేళలో గుంతలోపడి అనేక వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. గుంతలో పడిన వాహనాలు దెబ్బతింటున్నాయి. దారి వెంట వచ్చే వాహనదారులు ఆదమరిస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే గోదావరిఖని–మంథని– కాటారం దారిలో పెద్దగుంతలు ఏర్పడుతున్నా సంబంధిత శాఖ పూడ్చడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

ప్రమాదకరంగా చెట్లు..

పెద్దపల్లి జిల్లాలోని అనేక రహదారులపై ప్రమాదకరంగా చెట్లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాటారం ప్రధాన రహదారిలో అడవిసోమన్‌పల్లిలో సమీపంలో రోడ్డుపై ఎండిపోయిన భారీ చెట్లు ప్రమదకరంగా ఉన్నాయి. చాలారోజులుగా ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహారిస్తున్నారు. ఏక్షణంలోనైనా చెట్లు పడిపోయే పరిస్థితి ఉంది. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారుల తీరుపై వాహనదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముత్తారం దారిలో సైతం చెట్టు ప్రమాదకర స్థితిలో చాలారోజుల నుంచి ఉన్నా తొలగించడం లేదు. ఇలా చాలాచోట్ల చెట్లు రోడ్డుపై ప్రమాదకంగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.

అడవిసోమన్‌పల్లి శివారులో ప్రమాదకరంగా ఉన్న చెట్టు

గోదావరిఖని – మంఽథని మధ్య పెద్దగుంత

ప్రమాదకరంగా రహదారులు

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement