విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
డీఈవో ఎస్.రాజు
కామారెడ్డి టౌన్: విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈవో ఎస్.రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల ముంగిపు కార్యక్రమానికి డీఈవో హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. 64 కళలలో నృత్యానికి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. అందులో జానపద నృత్యం గ్రామీణ ప్రజల గుండె చప్పుళ్లను ప్రతిధ్వనిస్తుందన్నారు. ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమారంపేట, ఇసాయిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ నాగవేందర్, న్యాయనిర్ణేతలు వసుధ, మనోహర్, భవాని, తదితరులు పాల్గొన్నారు.


