దాడులు దాడులే.. వసూళ్లు వసూళ్లే...
రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్లపై అప్పుడప్పుడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం, ఏవో కేసులు నమోదు చేయడం తర్వాత వసూళ్లు యథావిధిగా నడుస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఏసీబీ అధికారుల కళ్లెదుటే వసూళ్ల పర్వం కొనసాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టుల్లో జరిగే వసూళ్ల దందా విషయం అందరికీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వ విధానాల్లో లోపాలే ఇలాంటివి కొనసాగడానికి కారణమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేసి రవాణా శాఖను బద్నాం చేయడమే తప్ప, తీసుకున్న చర్యలు పెద్దగా ఏమీ ఉండడం లేదు. వసూళ్లను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


