వైద్యుడి సస్పెన్షన్
ఫ విధుల నుంచి స్టాఫ్ నర్స్ తొలగింపు
తుని: స్థానిక ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన అనంతరం ఓ యువకుడి కాలు లోపలే సర్జికల్ బ్లేడ్ ఉంచి కుట్లు వేసిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ సంఘటనపై ‘బోల్టు తొలగించమంటే.. బ్లేడు వదిలేసి కుట్టేశారు’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్తకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారి చక్రధర్‌బాబును ఆదేశించారు. ఆ మేరకు చక్రధర్‌బాబు ఆసుపత్రిలో ఆదివారం విచారణ చేపట్టారు. ఆపరేషన్ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్స్ పద్మావతి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. ఈ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
వరాలు, శాపాలు
దేవతల ప్రణాళికలే..
అల్కాట్ గార్డెన్స్ (రాజమహేంద్రవరం రూరల్): వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఆయన గరుత్మంతుని ఆవిర్భావం, మహిమలను వివరించారు. ‘ఉచ్చైశ్రవం అనే అశ్వం తోకకు చుట్టుకుని, నల్లగా కనపడేటట్లు చేయాలని కద్రువ తన సంతానమైన సర్పాలను ఆదేశించింది. అలా చేయడానికి తిరస్కరించిన కొన్ని సర్పాలను జనమేజయుడి సర్ప యాగంలో ఆహుతి కమ్మని శపించింది. అయితే, ఈ సర్పాలు అత్యంత తీవ్రమైన విషాన్ని, మానవ జాతిని నాశనం చేసే శక్తి కలిగినవి. వినత తొందరపాటుతనంతో ఒక అండాన్ని పగులగొట్టినందుకు, పూర్తి అంగాలు ఏర్పడని ఒక కుమారుడు కలిగాడు. అతనే సూర్యుని రథసారథిగా వెళ్లిపోయాడు. మరో అండం నుంచి గరుత్మంతుడు వెలువడ్డాడు. అతడు వేద స్వరూపుడు. వేదంలోని ఛందస్సులు ఆయన రెక్కలు. వేదంలో సౌపర్ణ సూక్తాలు కనపడతాయి. వీటిని చదవలేని వారి కోసం వేదవ్యాసుడు 12 శ్లోకాలతో దేవతలు చేసిన గరుడ స్తుతిని మనకు అందించారు. గరుత్మంతుని స్తోత్రంలో విష్ణుపరమైన నామాలు, విష్ణు సహస్రంలో ‘సుపర్ణ’ ఇత్యాది గరుత్మంతుని నామాలు కనబడతాయి’ అని సామవేదం వివరించారు. ‘తల్లి దాస్య విముక్తికి సుర లోకం నుంచి అమృతాన్ని తీసుకువచ్చిన గరుత్మంతుడు దర్భలపై ఆ కలశాన్ని ఉంచాడు. స్నానం చేసి రావడానికి సర్పాలు వెళ్లాక, ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకువెళ్లిపోయాడు. వచ్చిన సర్పాలు దర్భలను నాకడం వలన వాటి నాలికలు రెండుగా చీలిపోయాయి. దర్భలు పవిత్రమైనవిగా భావించడానికి కారణం– వాటిపై గరుత్మంతుడు అమృత కలశాన్ని ఉంచడమే. విషసర్పాలకు అమృతం ఇవ్వడం ప్రమాదకరమని భావించి, ఇంద్రుడు ఈ కార్యానికి పూనుకున్నాడు. గరుత్మంతుడు, ఆయన తల్లి దాస్యవిముక్తులయ్యారు’ అని సామవేదం వివరించారు. కష్టాన్ని సహించడమే తపస్సు అని చెప్పారు. విద్య అంటే సమాచార సేకరణ కాదని, ఒక దివ్యమైన శక్తి అని, మనది విద్యల దేశమని, ఇక్కడున్నన్ని విద్యలు మరెక్కడా లేవని అన్నారు. నిలబడి ఆచమనం చేయరాదని, ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయరాదని, ఆచమన జలం మీసాలకు తగలరాదని, వేడిగా ఉండరాదని చెప్పారు. పనికిమాలిన చరిత్ర పుస్తకాలు చదివే మనం మహర్షులు రాసిన సత్యాలను నమ్మకపోతే ఎలాగని సామవేదం ప్రశ్నించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణను
అడ్డుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం పొంచి ఉందని యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆంధ్ర, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. నగరంలో ఆదివారం జరిగిన యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకుల ప్రైవేటీకరణను అన్ని విధాలా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాలంతో పాటు బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి, సమస్యలపై పోరాటం సాగించాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉదయ కుమార్ మాట్లాడుతూ, రోజువారీ బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు.
వైద్యుడి సస్పెన్షన్


