నిబంధనలకే ప్రాధాన్యం
● అన్నదాతలకు ‘తేమ’ ఇక్కట్లు
● 17 శాతం లోపు ఉంటేనే
కొంటున్న మిల్లర్లు
● ఇదే అదనుగా దళారుల దందా
● బస్తాకు రూ.400 వరకూ కోత
● నష్టపోతున్న రైతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తరచుగా చెబుతూనే ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం రైతుల నుంచి ఆవిధంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. ముఖ్యంగా తేమ శాతం నిబంధనలు అన్నదాతలకు తలనొప్పిగా మారాయి. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వానికి విక్రయిస్తే ధాన్యం డబ్బులు వెంటనే రావనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ బాధలు పడలేక, మరో గత్యంతరం లేక ఎక్కువ మంది రైతులు దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
తేమ శాతం సాకుతో..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకూ 1.60 లక్షల ఎకరాల్లో వరి కోతలు జరిగాయి. సామర్లకోట, పిఠాపురం, కరప, కొత్తపల్లి, గొల్లప్రోలు, తుని, శంఖవరంతో పాటు పలు మండలాల్లో ఇప్పటికే కోతలు దాదాపు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులు రోడ్లు, కళ్లాల్లో ధాన్యం ఆరబోసుకొంటున్నారు. సాధారణ రకం ధాన్యం బస్తాకు (75 కేజీలు) రూ.1,777, సన్న రకాలకు రూ.1,792 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. తీరా కొనుగోలుకు వచ్చేసరికి ఆవిధంగా జరగడం లేదు. సంప్రదాయ పద్ధతిలో కోతలు కోస్తే పెట్టుబడి ఎక్కువైపోతున్నందున జిల్లాలోని అత్యధిక శాతం రైతులు యంత్రాలతోనే వరి కోతలు చేపడుతున్నారు. కోతలు పూర్తయిన రెండు మూడు రోజుల తర్వాత రైతు సేవా కేంద్రాలకు (ఆర్‌ఎస్‌కే) ధాన్యం తీసుకువెళ్తున్నారు. అక్కడి సిబ్బంది ఆ ధాన్యాన్ని సమీప రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత రైతులకు అసలు కష్టాలు మొదలవుతున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబోసి మళ్లీ తీసుకు రావాలని చెబుతున్నారు. దీంతో, రైతులకు రవాణా ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతుల నుంచి బస్తా ధాన్యానికి రూ.300 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో వాతావరణం కూడా రైతులను కలవరపెడుతోంది. ధాన్యం ఆరబోసిన సమయంలో అనుకోకుండా వర్షం కురిస్తే మొదటికే మోసం వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ కష్టాలకు ఎదురీదలేక దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది అధికారుల అంచనా. ఇందులో 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకూ 90 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సర్కారు కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆరబెట్టడానికి అదనపు ఖర్చు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండాలంలంటే రైతులు కుప్పలు వేసి కనీసం వారం, పది రోజులు పైగా నిల్వ ఉంచాలి. లేదంటే యంత్రాలతో పంట కోతల తరువాత వారం రోజులు పైగా కళ్లాలు, రహదారులపై ధాన్యం ఎండబోయాలి. ఇలా చేయాలంటే కూలి ఖర్చుల వంటి రూపాల్లో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రతి గింజా మద్దతు ధరకే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
డబ్బులెప్పుడొస్తాయో..!
గత ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం అమ్మిన రైతులకు సుమారు రెండు నెలలు గడచినా కూడా ప్రభుత్వం డబ్బు జమ చేయలేదు. దీంతో, అప్పట్లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఒకవేళ మద్దతు ధరకు ఆశ పడి ఆర్‌ఎస్‌కేల ద్వారా మిల్లుకు తరలించినా.. గతానుభవం దృష్ట్యా అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఎప్పటికో కానీ డబ్బులివ్వదేమోనని రైతులు భయపడుతున్నారు. మిల్లుకు ధాన్యం తరలించిన 24 గంటల్లో తమ ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పడమే తప్పా నెలల తరబడి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయాలకు వారు సంకోచిస్తున్నారు. వచ్చేది తక్కువే అయినా మరో దారి లేక దళారులకే అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
90 వేల టన్నుల కొనుగోలు
ఇప్పటి వరకూ 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉంటే మద్దతు ధర తప్పకుండా వస్తుంది. కోసిన వెంటనే కాకుండా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఆర్‌ఎస్‌కేల్లో మాత్రమే విక్రయించాలి. దళారులను నమ్మి తక్కువ రేటుకు విక్రయించవద్దు.
– దేవుల నాయక్,
జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్
‘మద్దతు’ దక్కడం లేదు
వారం పది రోజులు ఆరబెడితే మాత్రమే మద్దతు ధర ఇస్తామని అంటున్నారు. అందుకే బయటి వ్యక్తులకు బస్తా రూ.1,550కి అమ్ముకున్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి.
– సామన గంగారావు,
రైతు, అచ్చంపేట, సామర్లకోట మండలం
75 రోజులు పట్టింది
గత ఏడాది ఖరీఫ్‌లో ఆర్‌ఎస్‌కేల ద్వారా మిల్లుకు ధాన్యం విక్రయించాను. సంబంధిత డబ్బు నా ఖాతాలో జమ చేయడానికి 75 రోజులు పట్టింది. దీంతో, రబీలో బయటి వ్యక్తుల వద్ద అప్పులు చేసి, సాగు చేయాల్సి వచ్చింది. అందుకే, ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే భయపడాల్సి వస్తోంది.
– కర్నీడి వీర్రాజు, రైతు,
తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం
నిబంధనలకే ప్రాధాన్యం
నిబంధనలకే ప్రాధాన్యం


