క్రీడలతో మానసికోల్లాసం
కాకినాడ లీగల్: క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం పెరుగుతాయని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదుల క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆనంది మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు స్నేహభావాన్ని పెంచుతాయని అన్నారు. చివరి రోజు సెమీ ఫైనల్స్‌లో న్యాయవాది కాకర వెంకటేశ్వరరావు జట్టుపై మరో న్యాయవాది జి.మోహన్ మురళీ జట్టు విజయం సాధించింది. న్యాయవాది పేపకాయల రామకృష్ణ జట్టుపై న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం జట్టు విజయం సాధించింది. ఫైనల్స్‌లో టాస్ గెలిచిన జి.మోహన్ మురళి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని, 148 పరుగులు చేసింది. అనంతరం, 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఏలూరి సుబ్రహ్మణ్యం జట్టు 58 పరుగులు చేయగా, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో నెట్ రన్ రేట్ ప్రకారం మోహన్ మురళి జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా విప్లవజ్యోతి, మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌గా కాకినాడ మూడో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.మోతీలాల్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


