ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీని పవన్ కల్యాణ్ అమలు చేయాలి. కుమారస్వామి పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు ఇస్తానని చెప్పారు. జగన్ ఫైనాన్స్ ఇంజినీరింగ్ వల్ల ఖజానా ఎప్పుడూ నిండుగా ఉండేది. ఎన్నికల్లో 143 హామీలిచ్చిన చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. ప్రతి వ్యాపారి డొక్కలు ఎండిపోయాయి. ప్రతి హామీ అమలు చేసేంత వరకూ కాలర్ పట్టుకుని లోకేష్‌ను అడుగుతాం. ఆ రోజు కాలర్ పట్టి అడగమని ఆయనే చెప్పారు. మత్స్యకార భరోసాను తొలి ఏడాది ఎగ్గొట్టిన బాబు.. వారికివ్వాల్సిన డీజిల్ రాయితీని ఎత్తేసి మోసం చేశారు.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
కూటమిని నమ్మి మోసపోయిన మహిళలు
మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహిళల భద్రత కోసం నాటి సీఎం వైఎస్ జగన్ ఎన్నో ఆలోచనలు చేశారు. ప్రజలు మోసపోయారనే పరిస్థితి కూటమి పాలనలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబు, పవన్‌లను ప్రజలు అడగాలి. ప్రజల తరఫున నిరంతరం పోరాడాల్సిన సమయమిది. ప్రతిపక్షంగా ఆ బాధ్యత మనపై ఎంతో ఉంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వకుండా ఏడాది కాలంగా నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. ఏడాదిలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక్కటే ఇచ్చారు. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఉచిత బస్సు ఊసే లేదు. వీటన్నింటిపై పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. చంద్రబాబుకు నిజాయతీ, నిబద్ధత లేనే లేవు.
– వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ పిఠాపురం కో ఆర్డినేటర్
పవన్.. షణ్ముఖ వ్యూహం అమలు చేయాలి