
రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ
సామర్లకోట: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వందేభారత్ రైలులో విజయవాడ నుంచి సామర్లకోట వచ్చి, కాకినాడ వెళ్తారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం స్థానిక రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ప్లాట్‌ఫాం, అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గాన్ని పరిశీలించారు. ప్రధాన మార్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండటంతో పార్సిల్ కార్యాలయం సమీపాన ఉన్న మార్గం నుంచి గవర్నర్ కాన్వాయ్ వచ్చే విధంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ మార్గంలోని వాహనాలను పూర్తిగా తొలగించాలని స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్‌కు సూచించారు. గవర్నర్ వస్తారనే సమాచారం నేపథ్యంలో స్టేషన్ ఆవరణను శుభ్రం చేయించడంపై రమేష్‌తో కలసి మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య పరిశీలన జరిపారు. కార్యక్రమంలో డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్పై అడపా గరగారావు, టికెట్ ఇన్‌స్పెక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
నేడు మరిడమ్మ ఆలయం
మూసివేత
పెద్దాపురం: మరిడమ్మ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి గురువారం విలేకర్లక తెలిపారు. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అమ్మవారికి కుంభం వేస్తారన్నారు. అందువలన ఆలయ తలుపులు మూసివేయడంతో శుక్రవారం అమ్మవారి దర్శనం ఉండదన్నారు. శనివారం వేకువజామున ఆలయం తెరచి, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఉద్యానవనశాఖ అధికారిగా
మల్లికార్జునరావు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఉద్యానవనశాఖ అధికారిగా నేతల మల్లికార్జునరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ పనిచేసిన బి.సుజాత కుమారి గత నెల 30 ఉద్యోగ విమరణ చేశారు. దీంతో కాకినాడ జిల్లా నుంచి మల్లికార్జునరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలోని హార్టికల్చర్ రంగంలో అంతర పంటల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సూక్ష్మ నీటిపారుదలశాఖ అధికారి ఎ.దుర్గేష్, విశ్రాంత డీహెచ్‌వో బి.సుజాత కుమారి, కొవ్వూరు మండల హార్టికల్చర్ అధికారి డి.సుధీర్ కుమార్ పాల్గొన్నారు.
సమర్థంగా నేరాల కట్టడి
● పోలీసు అధికారులు, సిబ్బంది సహకారం భేష్
● ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
● నేర సమీక్షలో ఎస్పీ నరసింహ కిశోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో నేరాలను సమర్థంగా అరికట్టగలుగుతున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అర్థ సంవత్సర నేర సమీక్ష నిర్వహించారు. 2025లో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసులు ఛేదించిన కేసులు, సాధించిన విజయాలను చర్చించారు. కేసుల దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కట్టడి చేయాలన్నారు. ఈ సమీక్షలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని, రాబోయే ఆరు నెలలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ