భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌

Jul 3 2025 5:34 AM | Updated on Jul 3 2025 5:34 AM

భారత్

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌

పిఠాపురం: ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అన్న సినీ గేయంలా నీలి సముద్రం అంచునే ప్రయాణం హాయి గొలపనుంది. నీలి సముద్రంలో పడవ ప్రయాణంతో పాటు పక్కనే భారత్‌మాల జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణం చూడముచ్చట గొలపనుంది. కేంద్ర జాతీయ రహదారుల విభాగం భారత్‌మాల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంది. పచ్చని చెట్లు, తెల్లని ఇసుక తిన్నెలు పక్కనే సముద్రం దానిని ఆనుకుని సన్నటి రోడ్డుతో ఇప్పటి వరకు ఉన్న తీర ప్రాంతం రానున్న రోజుల్లో పరిశ్రమలు, జాతీయ రహదారులతో పారిశ్రామిక వాడగా మారనుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల నిధులు వెచ్చించి కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. భారత్‌మాల ప్రాజెక్టుతో తీర ప్రాంతం పారిశ్రామిక తీరంగా మారబోతోంది. అన్నవరం నుంచి కాకినాడ రూరల్‌ మండలం లైట్‌హౌస్‌ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుండడంతో జిల్లాలో సాగరతీరం పారిశ్రామిక మణిహారంగా మారబోతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ సాగరతీరంలో పారిశ్రామికీకరణకు చర్యలు తీసుకున్నారు. ఆయన సూచనల మేరకు అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ భారతమాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయించారు. అప్పట్లోనే ఈ రోడ్డుకు భూసేకరణ కూడా పూర్తి చేశారు.

40.621 కిలోమీటర్ల మేర రోడ్డు

ఇప్పటి వరకు సాధారణ రోడ్డు సౌకర్యం మాత్రమే ఉన్న కాకినాడ తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. దీనికోసం కాకినాడ రూరల్‌ మండలంలో వాకలపూడి లైట్‌హౌస్‌ నుంచి తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన ఫారెస్ట్‌ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం వరకు రోడ్డు నిర్మాణం కానుంది. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 180 ఎకరాల భూమిని సేకరించారు. 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. భూసేకరణ పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.621 కిలోమీటర్ల మేర నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది.

నిధులు మంజూరు

భారత్‌మాల ఎన్‌హెచ్‌ 16 ఎఫ్‌ భారత్‌మాల పరియోజన ఫేజ్‌ 1లో భాగంగా రోడ్డు నిర్మాణానికి కేంద్రం తొలి విడతగా రూ.1,040 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించింది. గత నెల 27న టెండర్లకు ఆహ్వానం పలుకుతూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆగస్టు 14వ తేదీ వరకు టెండర్లకు గడువు విధించారు. ఆగస్టు 18న బిడ్లు తెరవనున్నారు. రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల గడువు విఽధించారు. రెండేళ్ల పది రోజుల్లో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి అయితే విశాఖపట్నం పోర్టు కాకినాడ పోర్టుకు అనుసంధానం కానుంది. రవాణా వ్యవస్థ పటిష్టం అవడంతో పాటు మత్స్య సంపద రవాణాకు మార్గం సుగమం అవుతుంది.

రెండు పోర్టులు అనుసంధానం

తీర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానం చేయడంలో ఈ రోడ్డు కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో పెరుమాళ్లపురంలో నిర్మాణమవుతున్న పోర్టు, ఉప్పాడ తీరంలో నిర్మాణం అవుతున్న మేజర్‌ హార్బర్‌లకు ఈ రహదారి కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు ఈ తీర ప్రాంతంలో ఏ సరకు రవాణా జరగాలన్నా అటు ఏడీబీ రోడ్డు, ఇటు కాకినాడ– తుని బీచ్‌ రోడ్డు మాత్రమే ఉపయోగపడేవి. బీచ్‌ రోడ్డులో భారీ వాహనాలు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌మాల నిర్మాణం ఇక్కడ పారిశ్రాక రంగానికి ఒక మైలు రాయిగా నిలవనుంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే

పారిశ్రామికాభివృద్ధి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగా మన తీర ప్రాంతంలో ఉప్పాడ మేజర్‌ హార్భర్‌, పెరుమాళ్లపురం పోర్టు, కాకినాడ సీపోర్టు నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. వీటన్నింటికి రవాణా సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భారత్‌మాల పరి యోజన కింద అన్నవరం నుంచి కాకినాడకు భారత్‌మాల నాలు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేశాం. అప్పట్లో దానిని మంజూరు చేయించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, రోడ్డు నిర్మాణానికి బాటలు వేశాం. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం శుభపరిణామం. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారిశ్రామికీకరణకు తీసుకున్న చర్యల ఫలితమనే చెప్పవచ్చు.

– వంగా గీతావిశ్వనాఽథ్‌, మాజీ ఎంపీ,

వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి

అన్నవరం నుంచి కాకినాడ వరకు

నాలుగు లేన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం

తొలి విడతగా రూ.1,040 కోట్లు

మంజూరు, టెండర్లకు ఆహ్వానం

రెండేళ్లలో రోడ్డు నిర్మాణం

పూర్తికి చర్యలు

రూపురేఖలు మారనున్న సాగర తీరం

ఫలించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కృషి

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌1
1/3

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌2
2/3

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌3
3/3

భారత్‌మాలకు గ్రీన్‌ సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement