ఆగస్టు 1 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Jul 4 2025 6:53 AM | Updated on Jul 4 2025 6:53 AM

ఆగస్టు 1 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఆగస్టు 1 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

కాకినాడ సిటీ: జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలో ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ ఆర్‌కే సింగ్‌ మాట్లాడుతూ, విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యాన అగ్నిపథ్‌ స్కీమ్‌ కింద ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకూ ఉన్న 13 జిల్లాలతో పాటు యానాంకు చెందిన దాదాపు 22 వేల మంది అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీరితో పాటు 145 మంది రిక్రూటింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. రిక్రూట్‌మెంట్‌ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై కలెక్టర్‌ షణ్మోహన్‌ దిశానిర్దేశం చేశారు. ప్రతి రోజూ సుమారు 800 మంది అభ్యర్థులు పాల్గొంటారన్నారు. వీరికి ఆహారం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ఆసక్తి ఉన్నవారు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ దేవులా నాయక్‌ను 77020 03535 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

9వ తేదీకి ఉచిత ప్రవేశాలు పూర్తి కావాలి

కాకినాడ సిటీ: ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలను ఈ నెల 9వ తేదీ నాటికి కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలు ఏదో ఒక కారణం చెప్పి తమ పిల్లలకు ఉచిత ప్రవేశాలు నిరాకరిస్తున్నాయంటూ తల్లిదండ్రుల నుంచి మూడు వారాలుగా గ్రీవెన్స్‌ సెల్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఉచిత ప్రవేశాలు కల్పించని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద విద్యార్థులు తల్లికి వందనం పథకం ప్రయోజనాలు కోల్పోకుండా ఈ నెల 9వ తేదీ లోగానే అర్హులైన అందరికీ ఉచిత ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరికై నా ఉచిత ప్రవేశం నిరాకరిస్తే అందుకు స్పష్టమైన కారణాలతో సంబంధిత ఎంఈఓకు వివరణ సమర్పించాలన్నారు. పాఠశాలలు తెలిపిన అభ్యంతరాలు, కారణాలను పునఃపరిశీలించి, తిరస్కరించిన విద్యార్థుల్లో అర్హులను ఎంఈఓలు మళ్లీ ఆయా పాఠశాలలకు కేటాయిస్తారని వివరించారు. ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా పేరెంట్‌, టీచర్‌ సమావేశాలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో డీఈఓ పి.రమేష్‌, సమగ్రశిక్షా అభియాన్‌ ఏపీసీ వేణుగోపాల్‌, ఎంఈఓలు, ప్రైవేట్‌ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement