న్యాయవాదులు విధుల బహిష్కరణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల వైఖరిని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీహాల్‌లో కోర్టు సముదాయం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ చేసుకొని నెలకు రూ.64,988 అద్దె కుదుర్చుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఏరియా సింగరేణి అధికారులు నవంబర్ 5వ తేదీ నుంచి కార్మికులకు ఫంక్షన్లు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించడం సరైనది కాదన్నారు. అఽధికారులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కమ్యూనిటీహాల్‌ను కోర్టు సముదాయం ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసచారి, శ్రావణ్‌రావు, రవీందర్, రాజ్‌కుమార్, శివకుమార్, కవిత, రవీందర్, ప్రశాంత, సుధారాణి, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.


