రహదారులు ధ్వంసం
వరద తాకిడికి దెబ్బతిన్న వంద ఫీట్ల రోడ్డు
హన్మకొండ: వరద తాకిడి కారణంగా హనుమకొండలోని వంద ఫీట్ల రోడ్డు మొత్తం ధ్వంసమైంది. గోపాల్‌పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు రోడ్డు పూర్తిగా పాడైంది. వరద తాకిడికి కోతకు గురైంది. తారు లేచిపోయి అడ్డదిడ్డంగా పడింది. రహదారులపై గోతులు ఏర్పడ్డాయి. రూ.4 కోట్ల నష్టం వాటిల్లింది. రెండేళ్లు రోడ్డు మూసివేసి ఎంతో కష్టపడి, ప్రత్యేక శ్రద్ధ చూపి రోడ్డు నిర్మించామని, ఇప్పుడు ఆ రోడ్డును చూస్తే ఎంతో బాధేస్తోందని రహదారులు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా హనుమకొండలోని గోకుల్ జంక్షన్ నుంచి ఇంజనీర్స్ కాలనీ వరకు నాలా రివిట్ వాల్ అక్కడ కూలిపోయింది. ప్రెసిడెన్సీ స్కూల్ ఎదురుగా నాలా పక్కన రోడ్డు కోతకు గురైంది. వంద ఫీట్ల రోడ్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాలనీల్లోనూ అంతర్గత రోడ్లు కోతకు గురయ్యాయి.


