మూడు రోజులు తుపాన్ ప్రభావం
భూపాలపల్లి: రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో తుపాన్ ప్రభావం ఉన్నందున జిల్లా యంత్రాంగం, ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, తుపాను ప్రభావంపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు పలు సూచనలు చేసిన అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 1.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు కార్యక్రమాలు చేపడుతామన్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం మార్కెట్‌లోకి రావచ్చనే అంచనా దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు తుపాను ప్రభావం ఉన్నందున గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు..
ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్ శర్మ


