నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలి
భూపాలపల్లి అర్బన్: అవినీతికి తావులేకుండా నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్, ప్లానింగ్ జీఎం సాయిబాబు కోరారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవినీతి సంస్థ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి అని, ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిజాయితీతో నిర్వర్తించడం ద్వారా మంచి పరిపాలన సాధ్యమవుతుందన్నారు. పారదర్శకత, సమర్ధత, ధర్మబద్ధత వంటి విలువలను వృత్తి జీవితంలో పాటించడమే విజిలెన్స్ లక్ష్యమన్నారు. ప్రతిఉద్యోగి తనకు కేటాయించిన 8 గంటల పనిని బాధ్యతతో నిర్వర్తించకపోవడం కూడా (విజిలెన్స్) బాధ్యతారాహిత్య చర్యలో భాగమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, ఎర్రన్న, జోతి, రవీందర్, రాజేశ్వర్, శైలేంద్రకుమార్, మారుతి, పోషమల్లు, కార్మిక సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు.


