కాళేశ్వరాలయంలో కార్తీకశోభ
● రూ.3.20లక్షల ఆదాయం
కాళేశ్వరం: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కార్తీకశోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. గోదావరి మాతకు పూజలు చేసి దీపాలు వదిలారు. సైకత లింగాలను తయారు చేసి పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో రూ.3,00, రూ.1,000 టికెట్ అభిషేక పూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్ష వత్తులు వెలిగించి లక్షముగ్గులు వేశారు. దీపారాదనలు చేఽశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. వివిధ పూజలు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.3.20లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. రాత్రి గోదావరికి హారతి కార్యక్రమం వేదపండితులతో నిర్వహించారు.
కాళేశ్వరాలయంలో కార్తీకశోభ


