ప్రభుత్వ అవసరాలకు అప్పగించొద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభాష్‌కాలనీ రోడ్డులోని సింగరేణి కమ్యూనిటీహాల్‌ను ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించకుండా కార్మికుల అవసరాలకు వినియోగించాలని ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బెతేల్లి మధుకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కమ్యూనిటీహాల్ ఎదుట ఆదివారం ఐఎన్‌టీయూసీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుకర్‌రెడ్డి మాట్లాడారు. కార్మికుల సౌకర్యార్ధం నిర్మించి సింగరేణి కమ్యూనిటీహాల్‌లను ఎనిమిదేళ్లుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వినియోగించారన్నారు. దీంతో కార్మికులు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల ఇబ్బందులు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అవసరాలకు అద్దెకు ఇవ్వవద్దని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ కలెక్టర్, సింగరేణి అధికారులు హాల్‌లను ఇతరులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయడం సరి కాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు జోగు బుచ్చయ్య, రాజేందర్, నర్సింగరావు, హుస్సేన్, శంకర్, వేణుగోపాల్, రమేష్ పాల్గొన్నారు.


