అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: మండలంలోని బుగులోని జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పనులను ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలను జాతర ప్రారంభమయ్యేలోపు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో బుగులోని జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా మార్చే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు, వీరేందర్, రమణారెడ్డి, విజేందర్, తిరుపతి, వీరబ్రహ్మం, సంతోష్, వెంకటేష్ పాల్గొన్నారు.


