యువత సన్మార్గంలో నడవాలి
● కాళేశ్వరంలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్
కాళేశ్వరం: యువత బాగా చదువుకొని, సన్మార్గంలో నడవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో శనివారం సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో 2కే రన్ నిర్వహించారు. డీఎస్పీ, సీఐ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువత, విద్యార్థులు, వర్తకసంఘం, ఆటో యూనియన్, పలు పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి, గుట్కా, గుడుంబా మత్తు పదార్థాలకు బానిసలుగా మారొద్దన్నారు. చదువు పట్ల శ్రద్ధ వహించి, ఉన్నత శిఖరాలు అందుకోవాలని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆటల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం 2కే రన్ విజేత రేవెల్లి సతీష్‌కు ప్రథమ, నుముల రాకేష్‌కు ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


