అక్రమాలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు అడ్డుకట్ట

Oct 26 2025 8:39 AM | Updated on Oct 26 2025 8:39 AM

అక్రమ

అక్రమాలకు అడ్డుకట్ట

కాటారం: ఉపాధి హామీ పథకంలో గతంలో జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నూతన సంస్కరణలను అమల్లోకి తీసుకొస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూలీలకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాబ్‌కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానం చేయడంతో పాటు కూలీకి సంబంధించి ఫొటోలు, జాబ్‌కార్డు, ఆధార్‌ వివరాలు సేకరించి ఈ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తిచేయని కూలీలు ఉపాధి పనులకు దూరం కానున్నారు. గతంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట..

ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ యాప్‌లో కూలీల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏలు) నకిలీ, పాత ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. పనులకు హాజరుకాకున్నా పాత ఫొటోలు పెడుతున్నారు. ఒకరి పేరుపై మరొకరు పనులకు వెళ్లినా హాజరు వేస్తున్నారు. ఈ అక్రమాలు సామాజిక తనిఖీల్లో బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పట్టినట్లు తేలినా రికవరీ అంతంత మాత్రంగానే ఉంటుంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది.

72శాతం ఈకేవైసీ పూర్తి..

జిల్లాలో ఇప్పటి వరకు 72 శాతం కూలీల ఈ కేవైసీ పూర్తి అయినట్లు అధికారుల లెక్కలు చెప్పుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత యాక్టివ్‌ కూలీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన తర్వాత మరోసారి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కూలీల వివరాలు యాప్‌లో నమోదు కాకపోతే పనులకు వెళ్లినా హాజరు వేయలేరు. పని ప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే జీపీఎస్‌ సిస్టం గుర్తిస్తుంది. తప్పుడు హాజరుగా నిర్ధారిస్తుంది. ఈకేవైసీ వందశాతం పూర్తయితే ఈజీఎస్‌లో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మస్టర్‌ విధానానికి స్వస్తి..

గతంలో ఉపాధిహామీ పనులు జరిగే ప్రదేశాల్లో రాత పద్ధతిలో మస్టర్‌లు వేసేవారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూలీల హాజరు తీసుకొని మస్టర్‌ వేసేవారు. ఎవరు వచ్చారనే విషయం తెలియక, పనులకు హాజరుకాని వాళ్లకు సైతం మస్టర్‌ వేసిన సందర్భాలు ఉండేవి. అలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా ఇకనుంచి ఉపాధిహామీలో మ్యానువల్‌ మస్టర్‌ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక యాప్‌లో మస్టర్‌లు వేయనున్నారు.

పకడ్బందీగా వివరాలు నమోదు..

ఉపాధిహామీలో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కూలీల ఈకేవైసీకి శ్రీకారం చుట్టాం. ప్రతి కూలీ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది ఈకేవైసీ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగిస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు.

– బాలకృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

ఉపాధి కూలీలకు ఈకేవైసీ

కూలీల ఫొటోలు, ఆధార్‌, జాబ్‌కార్డుల సేకరణ

యాప్‌లో వివరాల నమోదు

జిల్లాలో ఉపాధిహామీ వివరాలు..

మండలాలు – 12

గ్రామపంచాయతీలు – 244

ఉపాధిహామీ బ్లాక్‌లు – 12

జాబ్‌కార్డుల సంఖ్య – 1,09,843

కూలీల సంఖ్య – 2,41,667

ఈకేవైసీ పూర్తయిన

కూలీల సంఖ్య – 1,76,000

(సుమారు)

అక్రమాలకు అడ్డుకట్ట1
1/2

అక్రమాలకు అడ్డుకట్ట

అక్రమాలకు అడ్డుకట్ట2
2/2

అక్రమాలకు అడ్డుకట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement