రేపు మద్యంషాపులకు లాటరీ డ్రా
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మద్యంషాపుల నిర్వహణ కోసం రేపు(సోమవారం) లాటరీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 59 షాపులకు గాను 1,863 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో భూపాలపల్లి పట్టణంలోని ఇల్లందు క్లబ్‌హౌజ్‌లో డ్రా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, దరఖాస్తుదారులు లేదా వారి ద్వారా అనుమతి పొందిన వారిని మాత్రమే కార్యక్రమం లోపలికి అనుమతిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు.
రీజియన్ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్ పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ రీజియన్ స్థాయి ఫుట్‌బాల్ క్రీడా పోటీలను శనివారం బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తుందని సింగరేణి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోలిండియా స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రీనివాస్, కోచ్‌లు, క్రీడాకారులు దేవయ్య, అంజయ్య, మల్లేష్, పురుషోత్తం, రాహుల్ పాల్గొన్నారు.
కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తులు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఇంగ్లండ్ దేశానికి చెందిన దంపతులు మిచెల్ రిచర్డ్, ఎలిజబెత్ శనివారం సందర్శించారు. ఆలయ చరిత్ర, శిల్పకళా నైపుణ్యాన్ని వారికి రామప్ప గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వివరించారు. అనంతరం వారు ఆలయంలోని శిల్పాలను వారి వెంట తెచ్చుకున్న కెమెరాలలో బంధించారు. ఆలయ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు.
దాడి ఘటనలో అరె స్ట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని బిట్స్ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటనలో బజరంగ్‌దల్ నాయకుడు శ్యామ్‌లాల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినట్లు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు యాజమాన్యానికి రాలేదన్నారు. వారికి ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే పోలీసులు, షీ టీంలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలపై ప్రజాసామ్య పద్ధతిలో మాత్రమే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, లేదా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. విద్యాసంస్థలపై దాడి చేసి ఆస్తి నష్టం కలిగించడం, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడం చట్ట విరుద్ధమన్నారు. నాలుగు రోజుల క్రితం చేసిన దాడి కేసులో యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగితే 100కు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ఏటూరునాగారం: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధిక, ములుగు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల, వైద్యురాలు అన్మిష అన్నారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్‌లో శనివారం నుంచి ములుగు డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఈ నెల 31 వరకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో 50మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని దత్తత తీసుకొని చెత్తాచెదారం తొలగించి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, మూత్రం, మల విసర్జన బయట ఎక్కడబడితే అక్కడ చేయొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మంజుల, జ్యోతి, సుకన్య, అరుణ, కేర్ టేకర్ సరిత, ఏఎన్‌ఎం పుణ్యవతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రేపు మద్యంషాపులకు లాటరీ డ్రా


