వేరుకుళ్లు, నల్లతామర
మిర్చి పంటను ఆశిస్తున్న తెగుళ్లు
7,360 ఎకరాల్లో సాగు..
భూపాలపల్లి రూరల్: ప్రకృతి వైపరీత్యాలు ప్రతీ సంవత్సరం వెంటాడుతుండగా.. మిర్చి రైతులకు కన్నీళ్లే దిక్కవుతున్నాయి. ఈ సారైనా కలిసి వస్తుందనే ఆశతో సాగుచేసిన వారికి మళ్లీ నిరాశే ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలు వారి పాలిటశాపంగా మారాయి. వర్షాల ప్రభావంతో పంటకు తెగుళ్లు ఆశించాయి. ప్రధానంగా విల్ట్ (వేరుకుళ్లు) తెగులుతో కాండం, మొక్కలు, ఆకులు ఎండిపోయా యి. ఎదగని పంటకు తోడు పూత దశలో ఆశిస్తున్న తెగుళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
దిగుబడి తగ్గే అవకాశం..
ఈసారి అధిక వర్షాలతో వర్షపు నీరు చేనులో నిలిచి ఉండడంతో వేరుకుళ్లు (విల్ట్) తెగులు మిర్చి పంటను ఆశించింది. దీంతోపాటు నల్లతామర, నల్లి పురుగు ఉధృతితో పంటలకు నష్టం వాటిల్లుతోంది. భూపాలపల్లి, చిట్యాల, మహాముత్తారం తదితర మండలాల్లో బ్లాక్ త్రిప్స్ (నల్ల తామర పురుగు), మైట్స్ (నల్లి పురుగు) ఉధృతి ఎక్కువగా ఉంది. మిర్చి పంటకు నారు కుళ్లు, ఆకుముడత, తెల్ల దోమ తెగుళ్లకుతోడు బూడిద తెగులు మొదలైంది. దీంతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగొండ మండలంలోని గూడెపల్లి, భాగిర్థిపేట, దుంపిల్లపల్లి, పొనగండ్ల, రేపాక, తిరుమలగిరి తదితర గ్రామాల్లో మిరప పంటను అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం మిరప పూత దశలో ఉంది. అధిక వర్షాలతో మిరప మొక్కలు జాలు పట్టి పోయాయి. ప్రధానంగా వేరుకుళ్లు తెగులు ఆశిస్తే మొక్క దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేగొండ మండలంలో 2,500, కొత్తపల్లిగోరిలో 1,800 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేశారు.
వాడిపోయి చనిపోతున్న మొక్కలు
పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి
లేదంటున్న రైతులు
పత్తాలేని ఉద్యానశాఖ అధికారులు
జిల్లాలో 7,360 ఎకరాల్లో సాగు
మిర్చి సాగులో జిల్లాకు మంచి పేరుంది. గతేడాది నల్ల తామర ప్రభావంతో మిర్చి దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోపడంతో రైతులు నష్టాలు చవిచూశారు., వానాకాలానికి సంబంధించి 2023లో జిల్లాలో 24,400 ఎకరాల్లో సాగు కాగా 2024లో 20,145 ఎకరాలు ఈ సంవత్సరం (2025) ఇప్పటి వరకు కేవలం 7,360 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో గతేడాది 20,145 ఎకరాల్లో మిర్చి సాగు కాగా.. ఈ ఏడాది కేవలం 7,360 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.


