రోగులకు పరీక్ష
ఇష్టారాజ్యంగా ల్యాబ్‌ల నిర్వహణ
ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వైద్యుల కనుసన్నల్లోనే ల్యాబ్‌ల దోపిడీ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాబ్‌లు కూడా వైద్యులవే కావడంతో అవసరం లేకుండా రకరకాల పరీక్షలు చేయిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. గర్భిణులు, చిన్నపిల్లల నుంచి మొదలు ముసలివారి వరకు ఆస్పత్రికి ఏ చిన్న జబ్బుతో వచ్చినా పరీక్షల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు విజిటింగ్ డాక్టర్లు కూడా అసిస్టెంట్‌లతో ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భూపాలపల్లి అర్బన్: వ్యాధిని నిర్ధారించే ల్యాబ్‌లు జిల్లాలో రోగులకు పరీక్ష పెడుతున్నాయి. అర్హత లేని టెక్నీషియన్లతో తప్పుడు రిపోర్టులు ఇస్తూ అబాసుపాలవుతున్నాయి. అనుమతులు లేకుండా నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. పరీక్షల పేరుతో అందిన కాడికి రోగుల నుంచి డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా ల్యాబ్‌లు పనిచేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలకేంద్రాల్లో ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలను పూర్తిగా మరిచిపోయారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
27 ఆస్పత్రుల్లో అనుమతులు
జిల్లాలో మొత్తంగా 27 ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లు పాథాలజీ చదివిన వారి పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని సెంటర్లు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్‌లో ఎంఎల్‌టీ పూర్తిచేసిన వారు ఉండాలి. కానీ పలు కేంద్రాల్లో అర్హులు కనిపించని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంతో పాటు కాటారం, చిట్యాల, గణపురం, మహదేవపూర్, కాళేశ్వరం, చెల్పూర్‌లలో అనుమతులు లేకుండా ల్యాబ్‌లు చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. కొంతకాలం ఆస్పత్రుల్లో అసిస్టెంట్లుగా పనిచేసి సొంత పరిజ్ఞానంతో జిల్లాలో ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, ఇతర ఆస్పత్రుల డాక్టర్లతో కుమ్మౖకై రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఆర్‌ఎంపీ డాక్టర్ల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో, ఇతర సొంత గదుల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్షలు చేసినట్లయితే ఇంత మొత్తం అంటూ ప్యాకేజీలు ప్రకటించి మరీ దందా నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, చికున్‌గున్యా, మలేరియాతో పాటు బీపీ, షుగర్ బాధితులు ఎక్కువగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
పట్టింపు కరువు
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు, వైద్యసేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆరోగ్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకున్నా, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆస్పత్రి లైసెన్స్ నుంచి మొదలు ల్యాబ్‌లో, డయాగ్నోస్టిక్ వరకు తనిఖీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులతో అనుసంధానమైన ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. గత నెలలో చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేశాం. అనుమతి ఉన్న వాటిలో అర్హత కలిగిన టెక్నీషియన్లను నియమించాలి. డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి మిషన్లు కేవలం ప్రైవేట్ ల్యాబ్, డాక్టర్లు రిపోర్టు ఇచ్చినట్లయితే చర్యలు తప్పవు. జిల్లావ్యాప్తంగా ల్యాబ్‌లలో తనిఖీలు నిర్వహిస్తాం.
రోగులు వ్యాధి ప్రారంభంలో ఒక ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని కలిసి పరీక్షలు చేయించుకుంటుండగా.. తగ్గకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్తున్నారు. రెండింటి దగ్గరలో పరీక్షలు చేయించుకుంటుండగా రిపోర్ట్ మాత్రం రెండు రకాలుగా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఏది నమ్మాలో తెలియక రోగుల్లో గందరగోళం నెలకొంటుంది. రిపోర్టుల ఆధారంగా వైద్యం చేసుకునే ఈ రోజుల్లో రిపోర్టులను నమ్మలేని పరిస్థితులు దాపరించాయి.
రోగుల గందరగోళం
వైద్యుల కనుసన్నల్లోనే..
అర్హతలేని టెక్నీషియన్లు
అడ్డగోలుగా డబ్బుల వసూలు
వైద్యారోగ్యశాఖ తనిఖీలు శూన్యం
రోగులకు పరీక్ష


