గురుకుల పాఠశాల విద్యార్థినులపై దాడి!
కాటారం: మండలంలోని దామెరకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులకు గాయాలైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల గొంతు, చెవి భాగాల్లో గాట్లు కావడంతో దాడి జరిగిందా లేక కావాలని ఎవరైన చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. కాటారం మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు దామెరకుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి వారు తమ గదిలో నిద్రిస్తున్న సమయంలో గొంతు, చెవి భాగాల్లో పదునైన వస్తువుతో గాట్లు పెట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అర్ధరాత్రి కావడంతో సదరు విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం హెల్త్ సర్వీస్ (హెచ్‌ఎస్), ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతో వారిని హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లినట్లు సమాచారం. గాయపడిన ఓ విద్యార్థిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో తన తండ్రిని చూసి విషయం చెపుతాను అని చెప్పగా హెచ్‌ఎస్ వారించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని హెచ్‌ఎస్, ఉపాధ్యాయినులు విద్యార్థినులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల పాటు విషయం బయటకు రాకుండా దాచి ఉంచారు. కాగా ఆదివారం విజిటింగ్‌లో భాగంగా సదరు విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా వారికి లోపలికి అనుమతించలేదు. చివరకు గొడవకు దిగడంతో తల్లిదండ్రులను పాఠశాల లోపలికి పంపించగా విద్యార్థుల గాయాలను గుర్తించిన వారు అక్కడ ఉన్న హెచ్‌ఎస్, సిబ్బందిని నిలదీశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించి తల్లిదండ్రులనే దబాయించినట్లు తెలిసింది. సమస్య బయటకు రాకుండా సామరస్యంగా మాట్లాడుకుందామని పాఠశాలకు చెందిన వారు తల్లిదండ్రులతో సంప్రదింపులకు దిగినట్లు తెలిసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఎస్సై శ్రీనివాస్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మిని వివరణ కోరగా రాత్రి సమయంలో విద్యార్థినులపై ఏదో పురుగు పాకడంతో అలా జరిగిందన్నారు. ఉదయం ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స చేయించామని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో తిరిగి పాఠశాలకు తీసుకొచ్చామన్నారు.
ఘటనపై పలు అనుమానాలు!
విద్యార్థినులకు గాయాలైన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినుల మధ్య ఏదైన ఘర్షణ చోటు చేసుకుందా.. లేక ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య విభేదాల కారణంగా విద్యార్థినులపై ప్రణాళిక ప్రకారం గాట్లు పెట్టారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంత పకడ్బందీగా ఉండే బాలికల గురుకుల పాఠశాలలోకి బయట నుంచి ఇతరులు ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో ఇది పూర్తిగా అంతర్గతంగా జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
గొంతు, చెవి వద్ద గాయాలు
ఆలస్యంగా వెలుగులోకి..
గురుకుల పాఠశాల విద్యార్థినులపై దాడి!


