పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
భూపాలపల్లి అర్బన్: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. అమరుల త్యాగానికి నివాళి అర్పించి స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 191 మంది పోలీసు అమరవీరుల పేర్లను అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకునే రోజని, వా రి త్యాగం మరచిపోలేనిదన్నారు. పోలీస్ శాఖ ఎల్ల ప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. పోలీసు అమరవీరులు దేశానికి చేసిన సేవ అనితర సాధ్యమన్నారు. వారి త్యాగాలతోనే సమాజం శాంతియుతంగా కొనసాగుతోందన్నారు. ప్రతీ రోజు వారి సేవలను స్మరించుకుంటూ మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొనగా వారిని సత్కరించారు. అంతకుముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ డీఎస్పీ సంపత్ రావు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీస్ సంఘం అధికార ప్రతినిధి యాదిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్‌ఖరే
పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం


