‘హద్దులు’ తేలేదెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

‘హద్దులు’ తేలేదెప్పుడో..!

Jun 27 2025 4:33 AM | Updated on Jun 27 2025 4:51 AM

● ప్రాజెక్ట్‌ పనుల్లో సర్వేయర్లు ● శిక్షణలో మరికొంత మంది ● భూ సమస్యలతో అన్నదాతలు

జగిత్యాల: భూమి హద్దులు తేలక.. సమస్యలు పరిష్కారంకాక రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా భూమి గెట్లకు సంబంధించిన గొడవలు జరుగుతుంటాయి. క్రయవిక్రయాలు జరిగినా భూముల కొలతల కోసం తహసీల్‌ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటారు. సర్వేయర్లు వచ్చి నక్ష ద్వారా భూ కొలతలు చేసి పంచనామా చేసి రైతులకు అందిస్తారు. కానీ.. జిల్లాలో మూడు నెలలుగా సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వేకు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడంతో దీంతో రైతులకు మధ్య తగాదాలు చోటుచేసుకుంటున్నాయి.

వేధిస్తున్న సర్వేయర్ల కొరత

జిల్లాలోని 20 మండలాల్లో 14 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. దీనికితోడు ఇటీవల మూడు ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద బీర్‌పూర్‌ మండలం కోమనపల్లిలో మ్యాప్‌ పటాలు తయారు చేస్తుండగా.. భూ భారతి చట్టంలో స్కెచ్‌లు, మ్యాప్‌లు వేసేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే మున్సిపాలిటీల్లో నక్ష ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగానే అధికారులు పనులు చేస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌కు నలుగురు సర్వేయర్లను ఎంపిక చేశారు. ఉన్న 14 మందిలో 12 మంది ప్రాజెక్ట్‌లలో ఉంటుండగా.. మరో ఇద్దరు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల శిక్షణలో పాల్గొంటున్నారు. ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లను కూడా ఈ ప్రాజెక్ట్‌లకు ఇన్‌చార్జిలుగా నియమించారు. దీంతో రైతుల సమస్యలు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రస్తుతం ఉన్న 14 మంది వివిధ ప్రాజెక్ట్‌ పనుల్లో నిమగ్నం కావడంతో రైతులకు సంబంధించిన కొలతలు చేపట్టకపోవడం ఇబ్బందిగా మారింది.

రానున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల కోసం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలలో శిక్షణ ఇస్తోంది. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియమకాలతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.

పెండింగ్‌లోనే దరఖాస్తులు

భూ సర్వే కోసం జిల్లాలో 420కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూ కొలతల కోసం రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. హద్దులు తేలక.. పంచాయితీలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించి కొలతలు చూపించి సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.

ఎండకాలంలోనే మేలు

వాస్తవానికి రైతులకు ఎండకాలంలో పనులు తక్కువగా ఉంటాయి. భూముల్లో కూడా ఎలాంటి పంటలూ వేయరు. భూములు బీడుగా ఉండటంతో కొలతలు సులువుగా చేపట్టే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు ఎండకాలంలో సర్వే చేయించేందుకే మొగ్గు చూపుతుంటారు. వర్షకాలం, చలికాలంలో పంటలు వేయడం ద్వారా భూమి కొలతలకు ఎవరూ ముందుకురారు. హద్దులు నిర్ణయించడం కూడా కష్టతరంగా ఉంటుంది. ఎండకాలానికి ముందే దరఖాస్తు చేసుకున్న రైతులు ఇంకా ఎదురుచూసూనే ఉన్నారు.

250 మంది సర్వేయర్లకు శిక్షణ

భూ రికార్డుల రూపొందించడంలో భాగంగా జిల్లాలో 250 మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలలో శిక్షణ పొందుతున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను కలిసి పలు సూచనలు చేశారు. భూ తదాగాలు లేకుండా కచ్చితమైన భూపటం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఏడీ వెంకట్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ అశోక్‌ పాల్గొన్నారు.

ప్రాజెక్ట్‌ పనుల్లో సర్వేయర్లు

కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్వేయర్లు ప్రాజెక్ట్‌ పనుల్లో ఉన్నారు. భూ భారతి చట్టం పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద భూ మ్యాప్‌లు, మున్సిపాలిటీల్లో నక్షలు రూపొందించే పనుల్లో సర్వేయర్లు ఉన్నారు. ఆ పనులు పూర్తి కాగానే రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

– వెంకట్‌రెడ్డి, ఏడీ

‘హద్దులు’ తేలేదెప్పుడో..!1
1/1

‘హద్దులు’ తేలేదెప్పుడో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement