
వాషింగ్టన్: అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న, అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటికే వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం.. తాజాగా విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
1978 నుండి అందుబాటులో ఉన్న ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” ఆధారంగా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అంటే వారు పూర్తి కాలం చదువుతున్నంత కాలం ఉండొచ్చు. అంటే ఒక కోర్స్ పూర్తయిన మరో కోర్సులో చేరి అక్కడే ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకుంటే విద్యార్థులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ద్వారా పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలి.
ఎఫ్-1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే.. ఆ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు.