సక్సెస్‌ఫుల్‌గా ల్యాండైన ‘పెర్సి’

NASA Historic Landing Of Rover On Mars In Hunt For Ancient Life - Sakshi

కేప్‌ కెనవరెల్‌: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ముందడుగు వేసింది. నాసా ‘పర్సవరన్స్‌’ రోవర్‌ ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అరుణ గ్రహంపై ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంకేతాలను కాలిఫోర్నియాలోని నాసాజెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీకి పంపించింది. ఇది అంగారక గ్రహంపై ఉన్న రాళ్లు, మట్టిని సేకరించనుంది. కాగా..మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్‌’నిలిచింది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్‌’నాసా పంపిన అతిపెద్ద, అత్యాధునిక రోవర్‌. 

రోవర్‌ ప్రత్యేకతలు..
ఇది ప్లుటోనియం ఇంధనాన్ని కలిగి ఉండి, కారు ‌సైజు‌లో ఉంటుంది. ఇది అరుణ గ్రహంపై నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో సంచరించనుంది. ఈ పెర్సీ రోవర్‌ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్‌ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

కీలక బాధ్యతలు నిర్వహించిన భారత మహిళ..
ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి మోహన్‌ కీలక బాధ్యతలు నిర్వహించారు. ‘మార్స్‌ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్‌ కంట్రోల్స్‌(జీఎన్‌ అండ్‌ సీ)కి ఆమె ఆపరేషన్స్‌ లీడ్‌గా నాయకత్వం వహించారు. మొత్తం ప్రయోగంలో లీడ్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్‌ కంట్రోల్‌ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహించారు. ‘జీఎన్‌ అండ్‌ సీ’సబ్‌ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరించారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్‌ అండ్‌ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top