
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, భారీ సంఖ్యలో చైనా విద్యార్థులు.. అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ విద్యార్థులపై వేధింపులు మాత్రం ఆపాలని విజ్ఞప్తి చేసింది.
కాగా, అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. చైనా విద్యార్థుల విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ప్రకటించడంపై చైనా స్పందించింది. ఈ సందర్బంగా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ..‘అమెరికాలో చదువుకునేందుకు చైనా విద్యార్థులకు ఆహ్వానిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చైనా విద్యార్థులను వేధించడం, ప్రశ్నించడం, నిరాధార ఆరోపణలతో స్వదేశానికి పంపించడం వంటి చర్యలను ఆపాలి. తద్వారా వారి చట్టబద్ధమైన హక్కులను రక్షించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వీసాలు, గ్రీన్‌కార్డులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. మరోవైపు.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల విషయంలో కూడా కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.