
న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడి
న్యూయార్క్: భారత్‌లో ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ శిఖరాగ్రానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే అవకాశాలు లేవని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. గత కొద్ది నెలలుగా ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ పత్రిక ఓ కథనంలో ఈ మేరకు విశ్లేషించింది. దీనిపై అమెరికా, భారత్ అధికారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
నవంబర్‌లో భారత్ ఆతిథ్యంలో జరిగే శిఖరాగ్రంలో ఆ్రస్టేలియా, జపాన్, అమెరికా దేశాల నేతలు పాల్గొనాల్సి ఉంది. భారత్–పాకిస్తాన్‌ల మధ్య కొనసాగిన నాలుగు రోజుల సంక్షోభం తన జోక్యంతోనే ముగిసిందంటూ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, భారత్ ఖండించడాన్ని న్యూయార్క్‌టైమ్స్ కథనంలో ప్రస్తావించింది. దీనిపై ట్రంప్ విషయంలో మోదీ సహనం కోల్పోయారని వ్యాఖ్యానించింది.
పాకిస్తాన్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడాన్ని ప్రస్తావించిన ట్రంప్..భారత్ కూడా అలాగే చేయాలని ఆశించి భంగపడ్డారని విశ్లేషించింది. ఇదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచేందుకు ఆజ్యం పోశాయని పేర్కొంది.
వీటికి ప్రతీకారంగానే రష్యా ఆయిల్ కొనుగోలు సాకుతో భారత్‌పై విపరీతంగా టారిఫ్‌ల భారం మోపారని తెలిపింది. టారిఫ్‌లపై చర్చలు కొలిక్కి రాకపోయేసరికి విసుగెత్తిన ట్రంప్ పలుమార్లు మోదీకి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని పేర్కొంది. అందుకే, భారత్–అమెరికాల మధ్య సంబంధాలు దిగజారడానికి రష్యా ఆయిల్ కొనుగోలు చేయడానికి మించిన కారణాలున్నట్లు విశ్లేషకులు సైతం అంటున్నారని ఆ కథనం వివరించింది.