
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చిల్లర చేష్టలకు దిగాడు. ఓ చిన్నారి అపురూపంగా భావించిన కానుకను హఠాత్తుగా లాగేసుకున్నాడు. పాపం.. దాని కోసం ఆ చిన్నారి ఆయన్ని బతిమిలాడుకోవడమూ వీడియో రూపేణా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దీంతో ఆ కుబేరుడిని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జరిగిన ఓ ఘటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ కామిల్ మజ్చ్‌శాక్ (Kamil Majchrzak) తన గెలుపు అనంతరం అక్కడున్న అభిమానులతో సందడి చేశాడు. ఆ సమయంలో ఓ చిన్నపిల్లాడికి క్యాప్ ఇవ్వబోయాడు. అయితే..
పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ క్యాప్‌ను లాగేసుకుని తన పక్కనే ఉన్న మహిళ బ్యాగులో దాచేశాడు. ఆ పిల్లాడు ఆ క్యాప్ కోసం బతిమాలినా పట్టించుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న పెన్నును మాత్రం ఆ పిల్లాడికి అప్పజెప్పాడు. దీంతో ఆ చిన్నారి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.
I wonder if this douche canoe grown man at the U.S. Open is worried that he will be recognized after he snatched a hat away from the boy on his left? pic.twitter.com/Q48ATFDoT7
— Brick Suit (@Brick_Suit) August 29, 2025
దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ చిన్నారి చేతుల్లోంచి క్యాప్‌ను లాగేసుకున్న వ్యక్తిని.. పోలాండ్‌కు చెందిన డ్రాగ్‌బ్రుక్ కంపెనీ CEO పియోటర్ షెరెక్ (Piotr Szczerek)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
మజ్చ్‌శాక్ స్పందన
ఈ వివాదంపై కామిల్ మజ్చ్‌శాక్ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నపిల్లాడిని వెతికి.. అతనికి కొత్తగా సంతకం చేసిన క్యాప్‌తో పాటు ఇతర టెన్నిస్ గిఫ్ట్స్ కూడా అందించారు. ‘‘ఈ క్యాప్ గుర్తుందా?’’ అని మజ్చ్‌శాక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

విమర్శల తరుణంలో.. షెరెక్ సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్ అయినప్పటికీ.. ఆయన పేరుతో గోవర్క్‌ఫోరం(Gowork) నుంచి ఒక ప్రకటన వైరల్ అవుతోంది. లైఫ్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్.. అనే తత్వాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది కేవలం ఒక టోపీ మాత్రమే. అంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే, తనపై దూషణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే అది ఆయన నుంచి వెలువడిన ప్రకటనేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే.. టోపీ వివాదం(Cap Controversy) దెబ్బకు షెరెస్ సీఈవోగా పని చేస్తున్న డ్రాగ్‌బ్రుక్ కంపెనీకి పెద్ద దెబ్బే పడింది. ఓ ఉద్యోగ రివ్యూ ఫోరంలో వేలాది మంది కంపెనీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కంపెనీ సేవలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు. దీంతో షేర్ వాల్యూ గణనీయంగా పడిపోయి.. కంపెనీకి భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అమెరికా ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ అదే కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగిణితో క్రిస్ మార్టిన్ కోల్డ్‌ప్లే షోలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి వదిలించుకుంది కంపెనీ. అయితే ఆ మహిళా ఉద్యోగిణిని మాత్రం లాంగ్ లీవ్‌లో పంపించేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎఫైర్ ఆయన వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.