యాంటీబయాటిక్స్‌ అతి వాడకంతో.. ముప్పే

Antibiotics Can Increase Risk Of Fungal Infections - Sakshi

సహజసిద్ధ రోగనిరోధకతపై తీవ్ర ప్రభావం

బర్మింగ్‌హామ్‌: కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు చిన్నచిన్న నలతలకు సైతం యాంటీబయాటిక్స్‌ వాడుతూ పోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకుంటారని సైంటిస్టులు హెచ్చరిస్తునే ఉన్నారు. అతిగా యాంటీబయాటిక్స్‌ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్‌ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్‌ కాండిడియాసిస్‌ సోకేందుకు కాండిడా అనే ఫంగస్‌ కారణం. 

ఈ ఫంగస్‌ సోకేందుకు యాంటీ బయాటిక్స్‌ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ బిర్మింగ్‌హామ్‌ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్‌) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది. ఇదే సమయంలో సదరు వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కీమోథెరపీ లాంటి చికిత్స తీసుకున్నా జీర్ణవాహిక నుంచి ఈ ఫంగి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాండిడియాసిస్‌ను కలిగిస్తుంది. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్‌ అందిస్తే కేథటర్‌ నుంచి కూడా ఈ ఫంగస్‌ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది.  

ప్రయోగ వివరాలు
యాంటీబయాటిక్స్‌ వాడకంతో ఫంగల్‌ వ్యాధులు సోకే అవకాశాలు పెరగడంపై పరిశోధనలో భాగంగా ముందుగా ఎలుకలకు యాంటీబయాటిక్‌ మిశ్రమాన్ని ఇచ్చారు. అనంతరం ఈ ఎలుకలకు కాండిడా ఫంగస్‌ సోకేలా చేశారు. మరో సమూహం ఎలుకలకు యాంటీబయాటిక్స్‌ ఇవ్వకుండా కేవలం ఫంగస్‌ను సోకేలా చేశారు. అనూహ్యంగా యాంటీబయాటిక్స్‌ వాడిన ఎలుకల్లో ఫంగస్‌ ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌ కలిగించినట్లు కనుగొన్నారు. సాధారణంగా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకిన జీవుల్లో మూత్రపిండాలు బలహీనపడతాయి, దీంతో ఆ జీవులు అనారోగ్యం పాలవుతుంటాయి.

ఈ ప్రయోగంలో ఎలుకలను మూత్రపిండాల బలహీనత కన్నా యాంటీబయాటిక్స్‌ మిశ్రమమే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు గుర్తించారు. ఎలుకల్లోని సహజసిద్ధ యాంటీ ఫంగల్‌ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను అది దెబ్బతీసిందని విశ్లేషించారు. రక్తంలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించే సైటోకైన్స్‌ అనే ప్రోటీన్ల ఉత్పత్తిని ఈ యాంటీబయాటిక్స్‌ తగ్గించాయి. దీంతో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత ఈ ఎలుకల్లో తగ్గిపోయిందని తెలిసింది. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్‌ వల్ల ఫంగల్‌ వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని నిపుణులు తెలిపారు. వాంకోమైసిన్‌ వల్ల ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ పెరిగే ప్రమాదం అధికమని గుర్తించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top