
భారతీయుల వలసపై ఆగ్రహం
జాత్యాహంకారానికి దేశంలో స్థానం లేదన్న ప్రభుత్వం
కాన్‌బెర్రా: ఆ్రస్టేలియాలో వలసదారులపై వ్యతిరేకత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ఆ్రస్టేలియన్లు ఆదివారం వలసలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రత్యేకించి భారతీయుల వలసలపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’పేరుతో ర్యాలీలు నిర్వహించారు.
వందేళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే ఐదేళ్లలో ఎక్కువ మంది భారతీయులు వచ్చారని, ఈ వలసలు తమ దేశంలోని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 నుంచి 2023 వరకు 845,800 మంది భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని వారు పంచిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఇది తాత్కాలిక సాంస్కృతిక మార్పు కాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పడుతోందని వారు ఆరోపించారు.
ఖండించిన ప్రభుత్వం..
ఈ ర్యాలీలను ఆ్రస్టేలియా ప్రభుత్వం ఖండించింది. జాత్యహంకారం, జాతికేంద్రీకరణపై ఆధారపడిన తీవ్రవాదానికి దేశంలో స్థానం లేదని పేర్కొంది. వారసత్వం ఏదైనా సరే, ఆ్రస్టేలియన్లందరూ సురక్షితంగా ఉండే హక్కును కలిగి ఉన్నారని పేర్కొంది. సామాజిక ఐక్యతను దెబ్బతీయాలని చూసే వ్యక్తులకు దేశంలో చోటు లేదని హోం వ్యవమారాల మంత్రి టోనీ బర్క్ అన్నారు.
ద్వేషాన్ని వ్యాప్తి చేసే, సమాజాన్ని విభజించే ఇలాంటి ర్యాలీలకు తాము మద్దతు ఇవ్వబోమని ఫెడరల్ లేబర్ మంత్రి ముర్రే వాట్ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలను ఆ్రస్టేలియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సరీ్వసెస్ కూడా ఖండించింది. వైవిధ్యమే ఆ్రస్టేలియాకు గొప్ప బలమని సంస్థ సీఈఓ కసాండ్రా గోల్డీ అన్నారు. ఫెడరల్ ప్రతిపక్ష నాయకుడు సుస్సాన్ లే సైతం ర్యాలీలపై స్పందించారు. ‘ప్రజల జాతీయత, మతం ఆధారంగా లక్ష్యంగా భావజాలానికి ఆ్రస్టేలియాలో స్థానం లేదు. హింస, జాత్యహంకారం లేదా బెదిరింపులకు ఇక్కడ చోటు లేదు. సామాజిక ఐక్యతను చీల్చే ద్వేషాన్ని, భయాన్ని అనుమతించలేం’అని స్పష్టం చేశారు.
ప్రధాన నగరాల్లో ర్యాలీలు..
సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రాతోపాటు ఇతర నగరాల్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. సిడ్నీలో దాదాపు పదివేల మంది రోడ్డెక్కారు. నగర మారథాన్ కోర్సు దగ్గరకు చేరి జాతీయ జెండాలతో ప్రదర్శించారు. మెల్‌బోర్న్‌లో, నిరసనకారులు ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ వెలుపల ఆ్రస్టేలియన్ జెండాలు, వలస వ్యతిరేక ప్లకార్డులతో రాష్ట్ర పార్లమెంటుకు కవాతు చేశారు. ర్యాలీని ఉద్దేశించి నియో–నాజీ వ్యక్తి థామస్ సెవెల్ మాట్లాడుతూ వలసలను ఆపకపోతే, మన మరణం ఖాయమన్నారు. ఇక్కడ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆరుగురిని అరెస్టు చేశారు. కాన్‌బెర్రాలో, పార్లమెంట్ హౌస్‌కు ఎదురుగా ఉన్న సరస్సు వద్ద జరిగిన నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. క్వీన్స్‌ల్యాండ్‌లో, ఫెడరల్ ఎంపీ బాబ్ కట్టర్ టౌన్స్‌విల్లేలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు.