తెల్లవార్లు ‘బార్లా’! | - | Sakshi
Sakshi News home page

తెల్లవార్లు ‘బార్లా’!

Apr 17 2026 11:26 AM | Updated on Apr 17 2026 11:26 AM

తెల్లవార్లు ‘బార్లా’!

కాజీపేట: వ్యాపారులు ఇష్టారీతిన మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు వైన్‌షాపులు, ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయించేందుకు అనుమతులున్నాయి. కానీ, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ కాజీపేటలోని పలు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుంచే యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. మందుబాబుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఆయా మద్యం షాపుల్లో ఈ విక్రయాలు బహిరంగంగానే సాగిస్తున్నారు.

పట్టని అధికారులు

ఈ విషయం ఎకై ్సజ్‌ శాఖ, సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి తెలిసినా మామూళ్ల మత్తులో మునగడంతో ఈ వ్యవహారంపై దృష్టిసారించలేకపోతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచే మద్యం మత్తులో ఉన్న మందు బాబులు వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపై రాకపోకలు సాగించే మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీనికితోడు రాత్రి సమయాల్లో వీధుల్లో మందుబాబులు వీరంగం సృష్టిస్తూ భయందోళనలు రెకెత్తిస్తున్నారు.

సీపీ ఆదేశించినా ఆగని అమ్మకాలు

మద్యం దుకాణాల కౌంటర్లపై మద్యం విక్రయించోద్దని, రోడ్లపై నిలబడి తాగడం సరైంది కాదంటూ నగర పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినా ఎక్కడా ఆగట్లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి తెల్లవారుజామున 6 గంటల్లోపే దుకాణాలు తెరచి అర్ధరాత్రి వరకు విక్రయాలు సాగిస్తున్నారు. కౌంటర్లపై లూజ్‌ సేల్స్‌ చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏ ఒక్క దుకాణంపై దాడి చేసి కేసులు పెట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, దేవాలయాలకు దూరంగా మద్యం దుకాణాలు ఉండాలనే నిబంధనలు పట్టణంలో ఎక్కడా అమలు కాకపొవడం చర్చనీయంశంగా మారింది. ఇప్పటికై నా సమయం సందర్భం లేకుండా విక్రయాలు సాగిస్తున్న దుకాణాదారులపై ఎకై ్సజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

సమయపాలన పాటించకపోతే చర్యలు

పట్టణంతోపాటు రూరల్‌ ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన వేళలను పాటించకుండా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండొచ్చు. వెంటనే విచారణ జరిపి చర్యలు చేపడతాం. – చంద్రమోహన్‌, ఎకై ్సజ్‌ సీఐ, కాజీపేట

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

నిబంధనలు పాటించని వ్యాపారులు

అమలుకు నోచుకోని ప్రభుత్వ ఆదేశాలు

Advertisement
 
Advertisement
Advertisement