హనుమకొండ కలెక్టర్. బల్దియా ఇన్‌చార్జ్
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: వేసవితాపం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగేందుకు సిటీలోని బస్‌షెల్టర్లలో స్ప్రింక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం హనుమకొండ పరిధిలోని పబ్లిక్ గార్డెన్, అమృత థియేటర్‌తోపాటు పలు బస్ షెల్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీడీఎంఏ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా మిస్టింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇది బహిరంగ శీతలీకరణ వ్యవస్థ అని, అధిక పీడన పంపులు, నాజిల్‌లను ఉపయోగించి సూక్ష్మ నీటి బింధువులను వెదజల్లుతూ వాటి ఆవిరికి పరిసర ఉష్ణోగ్రతలను 20 ఫారెన్ వేడిని తగ్గిస్తుందన్నారు. బస్టాండ్‌లో వేచి ఉండే ప్రయాణికులపై నీటి బిందువులు పడి వేడిమినుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని తెలిపారు. నగర పరిధిలోని పబ్లిక్ గార్డెన్, అమృత థియేటర్ వద్ద శంఖం నమూనాలో ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర షెల్టర్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించండి
హనుమకొండ జిల్లా కోర్టు, సర్క్యూట్ గెస్ట్ హౌజ్ రోడ్డులో ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం రాత్రి హనుమకొండలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కడాయి రెస్టారెంట్ చౌరస్తా రోడ్డులో పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్.. ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత భవన నిర్మాణంలోపు వ్యాపారాలను నిర్వహించుకోవాలని, ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీలను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇలాంటి ఆక్రమణల వల్ల పారిశుద్ధ్య పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందని సూచించారు. ఏదో రోజు కాకుండా నిత్యం రహదారులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. డీఎఫ్‌ఓ శంకర్ లింగల, కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న, తదితరులు ఉన్నారు.


