
ప్రగతి.. అధోగతి
తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలి జిల్లాలోని ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ. అభివృద్ధిలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతుందని నమ్మబలికారు. మున్సిపల్ నిధులతో కొన్ని పనులను ఆర్భాటంగా ఆరంభించారు. ఏడాది తర్వాత చూస్తే బిల్లుల చెల్లింపు సున్నా...కొత్తగా ఆమోదం తెలిపిన పనులకు నెలలు గడుస్తున్నా టెండర్లూ పిలవడం లేదు.
కౌన్సిలర్ల ఆందోళన
ప్రభుత్వ విధానంపై మున్సిపాలిటీలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి కూడా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతోనే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రకటించడం గమనార్హం.
రూ.8.50 కోట్ల బిల్లులు పెండింగ్
పట్టణంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 105 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.8.50 కోట్ల బిల్లులను మున్సిపల్ అధికారులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశారు. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగలేదని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ బ్యాంకు ఖాతాల్లో నిధులున్నా నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది.
పేరుకే అజెండాలో నిధులు
ప్రతి నెలా జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అధికారులు వివిధ అభివృద్ధి పనులను అజెండాలో పొందుపరుస్తున్నారు. కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకున్నప్పటికి వాటిలో ఎక్కువ భాగం టెండర్ల దశకు వెళ్లడం లేదు. ఇందుకు నిధుల కొరతను సాకుగా అధికారులు చూపుతున్నారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై కౌన్సిలర్ల నిరసనతో వాడివేడిగా కొనసాగింది. సుమారు ఎనిమిది నెలలు గడచినప్పటికీ, ఇప్పటికీ టెండర్ల దశకు పనులు చేరుకోకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు. తెనాలి పట్టణంలో రూ.7.70 కోట్ల విలువైన 46 పనులను చేపట్టేందుకు కౌన్సిల్ అనుమతించినా, ఆయా పనులు ఇప్పటివరకు టెండర్ల దశకు వెళ్లలేదు, కౌన్సిల్‌లో అధికారులు ఇదే విషయాన్ని సభ్యులకు తెలియజేశారు.
తొలి ఏడాది ఆంధ్రా ప్యారిస్‌లో
కుంటుపడిన అభివృద్ధి
చేసిన పనులకు చెల్లింపు నిల్
కౌన్సిల్ ఆమోదించిన పనులకు
టెండర్లు పిలవడంలో ఉదాసీనత
బిల్లుల చెల్లింపుల్లో మార్పులు
కూటమి ప్రభుత్వం ఇటీవల బిల్లుల చెల్లింపుల్లో మార్పులు తీసుకొచ్చింది. గతంలో చేసిన తరువాత వర్కింగ్ ఇన్‌స్పెక్టర్, ఏఈ, డీఈ, ఎంఈ, కమిషనర్‌లు ఆయా పనులను పరిశీలించి బిల్లులు రూపొందించేవారు. అందరి ఆమోదంతో ఆడిట్‌కు పంపేవారు. వారి అనుమతి తరువాత కాంట్రాక్టర్ల అకౌంట్‌లో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడా విధానం మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నిఽధి యాప్‌లో బిల్లులను ఆప్‌లోడ్ చేయాల్సి ఉంది. అధికారుల అనుమతి తరువాత చెల్లింపులు జరగాల్సి ఉంటుంది. అయితే, నిధి యాప్‌లో లోపాలతో బిల్లులు పెట్టడానికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు. యాప్‌లోని సమస్యలను పరిష్కరించే వరకు బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రగతి.. అధోగతి