
కూటమి విష ప్రయోగం
పెదకాకాని: ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం పంట కాలువల శుభ్రం చేపట్టింది. పెదకాకాని మండలంలో రెండు పంట కాలువల ద్వారా సాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలోని సీతానగరం వద్ద ప్రారంభమైన గుంటూరు చానల్(కొత్త కాలువ) వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు వరకూ 47 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కాలువ పొడవునా 33 గ్రామాల ప్రజలు మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగు అవుతోంది.
నీటి సంఘాల క్కుర్తి
ఏటా కాలువల్లో పేరుకు పోయిన గుర్రపుడెక్క, నాచు, తూటికాడ తొలగించేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ టెండర్లు ఆహ్వానించి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. అయితే, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం నీటి సంఘాల నాయకులకు అప్పగించింది. మంగళగిరి రూరల్ మండలం కాజ శివారు ప్రాంతం నుంచి బుడంపాడు వరకూ 17 కిలోమీటర్ల పొడవునా గుర్రపుడెక్క, తూటికాడ, నాచు తొలగించేందుకు రూ. 24 లక్షలు కేటాయించింది. యంత్రాలు, కూలీలను ఉపయోగించి చేయాల్సిన పనుల్లో నీటి సంఘాల నాయకులు కక్కుర్తి పడ్డారు. డబ్బులు మిగుల్చుకునే పనిలో భాగంగా కాలువ పొడవునా గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో తూటికాడ, గుర్రపుడెక్క ఎండి కుళ్లిపోతోంది. నీరు దుర్వాసన వెదజల్లుతోంది.
అధికారుల పర్యవేక్షణ కరువు
గుంటూరు చానల్ నీటిని పలు గ్రామాల ప్రజలు తాగునీటికి వినియోగిస్తున్నారు. కలుషిత నీరు వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం గడ్డి మందు పిచికారీ చేయకూడదు. నిధులు మాత్రం మంజూరు చేసి సాగునీటి శాఖ అధికారులు పనుల పర్యవేక్షణ మరిచిపోయారు. ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు.
గుంటూరు చానల్‌లో
గడ్డి మందు పిచికారీ
పట్టించుకోని అధికారులు
కుళ్లిపోతున్న గుర్రపు డెక్క, తూటికాడ
కలుషితమవుతున్న నీరు
సాగు, తాగునీరుగా ఉపయోగిస్తున్న
పలు గ్రామాల ప్రజలు