
‘మిషన్ ఉన్నతి’తో రైల్వే ఉద్యోగులకు మేలు
లక్ష్మీపురం: ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాచరణ కొనసాగింపునకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పట్టాభిపురం కార్యాలయంలో మంగళవారం ‘మిషన్ ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మిషన్ ఉన్నతి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేలా కీలకమైన స్థానాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులు స్వయంగా వారి జూనియర్లకు పదోన్నతి ఉత్తర్వులను అందజేయిస్తున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఆయా విభాగాలలో ఆరుగురు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందగా వారి చేతుల మీదుగా వారి తరువాత విధులు నిర్వహించే సిబ్బంది పదోన్నతులు పొందడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్‌ఎం సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎఫ్‌ఎం అమూల్య బి.రాజ్ పాల్గొన్నారు.
ఆత్మీయ స్పర్శతోనే వైద్యానికి వన్నె
గుంటూరు ఎడ్యుకేషన్: మందుల కన్నా ఆత్మీయ స్పర్శతోనే వైద్యానికి వన్నె తెస్తుందని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులోని చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్, ఇండియన్ ఇంటలెక్చ్యువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి ఆధ్వర్యంలో సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అనే అంశంపై జూమ్ వేదికగా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉన్నత వృత్తులలో వైద్య వృత్తి ఒకటని, దేవుని తర్వాత ప్రాణం నిలిపే అవకాశం వైద్యునికే ఉండడం ఒక అద్భుతమైన వరం వంటిదని అన్నారు. జేబును చూసి వైద్యం చేయడం కన్నా రోగి జబ్బు చూసి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా వైద్యులు ఉండాలని, కార్పొరేట్ల మాయాజాలం, కాసుల కక్కుర్తి అవాంఛనీయమైనవని, మందుల కన్నా మృదువైన మాటలు, మానవీయ స్పర్శ అత్యున్నత ఫలితాలను అందిస్తాయని అందుకే వైద్య వృత్తికి మానవీయ దృక్పథం మకుటంలా నిలుస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాఖ్యాత కోపల్లి జయకర్ బాబు, జి. శాంతమూర్తి మాట్లాడారు. జూమ్ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వాడకుప్ప సుధాకర్, ఏలీ, ఎం.స్వాములు, ప్రియా జాన్, బాలకృష్ణారెడ్డి, కవి, రచయిత కాపిరెడ్డి కృష్ణారెడ్డి, గునుకూరు రత్నరాజు, శ్రీ విష్ణు, గాలి శాంత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.