
జలజీవన్ మిషన్ తీరుపై విచారణ
గుంటూరు వెస్ట్: వర్షపు నీటిని ఒడిసి పట్టడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతి పరిశీలించడానికి కేంద్ర జల శక్తి శాఖ పరిశీలకులు కిరణ్‌కుమార్ కర్లపు, రేష్మి పిళ్లైతో కూడిన అధికారుల బృందం రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో మమేకమై ప్రభుత్వ విధానాలపై ఆరా తీశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఫారం ఫాండ్, వాన నీటి సంరక్షణ, నిర్మాణాలు, అమృత్ సరోవర్లు, నర్సరీలు, పండ్లు, పూలతోటలు పెంపకం, తదితర విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో చేపడుతున్న పనులు బాగున్నప్పటికీ వాటిని వెబ్‌సైట్‌ల్లో ఫొటోలు అప్‌లోడు చేయకపోవడం వలన పురోగతి మార్గాలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుతుపవనాలు రావడానికి ముందు, తరువాత నీటి లభ్యతను లెక్క వేయడంలో భాగంగా రానున్న అక్టోబరు నెలలో మరోసారి జిల్లాలో పర్యటిస్తామన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై పథకాలపై చర్చించారు.