
కులం పేరుతో దూషణ, దాడి
దుగ్గిరాల: కులం పేరుతో దూషించి, స్పృహ కోల్పోయేటట్లు కొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యానాది యూత్ ఫెడరేషన్ నాయకులు సోమవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. యానాది కులానికి చెందిన కన్నం మాధవి, కన్నం మరియమ్మ, వి.నరేంద్రబాబులు ఆదివారం కె.ఆర్. కొండూరు గ్రామంలో షాపింగ్ చేసుకొని వస్తుండగా ఇద్దరు చిన్న పిల్లలు తగువులాడుకుంటూ ఉండగా గొడవ ఎందుకని వారికి సర్ది చెప్పి వెళుతున్నారు. ఈ సమయంలో నలుగురు ముస్లిం యవకులు పెద్దగా అరుస్తూ వారిని కులం పేరుతో తిట్టి, కొట్టి గాయపరచారు. కేసు పెట్టేందుకు వెళుతుంటే అడ్డగించి బెదిరించారు. విషయాన్ని యానాది యూత్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులతో కలసి సోమవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. యానాది యూత్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కొమరగిరి సూరిబాబు, రావూరి గోపి, అశోక్, మరియమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.