
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం
ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు
తాడేపల్లి రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ముత్యాలనగర్‌లో శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కార్మికులకు జీతాలు పెరగక, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 18,500 రూపాయలు జీతం ఇవ్వాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. జూలై 1న అన్ని పట్టణాలలో మున్సిపల్ కార్మికులతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జూలై 4న ధర్నా చౌక్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తాడేపల్లి పట్టణ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు.